
సాక్షి, అమరావతి : కడప జిల్లాలో అధికార టీడీపీ పార్టీకి హిమాలయ శిఖరంలా అడ్డుగా ఉన్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైఎస్సార్ జిల్లాలో అజాతశత్రువుగా పేరుగాంచిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హతమార్చారని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరి వాడిని చేయడం, మానసికంగా దెబ్బతీయడం కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా నరికి చంపారని ట్విటర్‌లో ధ్వజమెత్తారు. వైఎస్ వివేకానందరెడ్డిని భౌతికంగా అంతం చేస్తే తప్ప కడపలో పట్టు దొరకదని అమానవీయంగా హతమార్చారని నిప్పులు చెరిగారు. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కుట్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లే బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు.