ఏఐజేఎస్‌పై ఏకాభిప్రాయం రాలేదు: కేంద్రం

Vijay Sai Reddy Questioned Law Minister Ravi Shankar Prasad In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత జుడిషియల్‌ సర్వీసెస్‌(ఏఐజేఎస్‌) ఏర్పాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాలు, హైకోర్టుల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఏఐజేఎస్‌ ఏర్పాటు కోసం రాష్ట్రాలు, హైకోర్టులతో ప్రభుత్వం సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జిల్లా జడ్జీల పోస్టుల నియామకం, జడ్జీలు, అన్ని స్థాయిలలో జుడిషియల్‌ అధికారుల ఎంపిక ప్రక్రియను సమీక్షించే అంశాన్ని, 2015 ఏప్రిల్‌లో జరిగిన ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఎజెండాలో చేర్చడం జరిగిందని మంత్రి వెల్లడించారు. అయితే జిల్లా జడ్జీల ఖాళీల నియామకాన్ని ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థ పరిధిలోనే చేపట్టడానికి తగిన విధివిధానాల రూపకల్పన బాధ్యతను ఆయా హైకోర్టులకే వదిలేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.

అలాగే తదుపరి సెక్రెటరీల కమిటీ ఆమోదించే.. అఖిల భారత జుడిషియల్‌ సర్వీసెస్‌ (ఏఐజేఎస్‌) ఏర్పాటుకై సమగ్ర ప్రతిపాదన రూపకల్పన కోసం రాష్ట్రాల, హైకోర్టుల అభిప్రాయాలను కోరడం జరిగిందని తెలిపారు. ఏఐజేఎస్‌ ఏర్పాటుకు సెక్రటరీల కమిటీ ఆమోదించిన ప్రతిపాదనతో సిక్కిం, త్రిపుర హైకోర్టులు ఏకీభవించాయని  వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్‌, బొంబాయి, ఢిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మద్రాసు, మణిపూర్‌, పట్నా, పంజాబ్‌, హరియాణా, గౌహతి హైకోర్టులు తిరస్కరించాయని చెప్పారు. ఏఐజేఎస్‌ ద్వారా భర్తీ చేసే ఖాళీలకు సంబంధించి అభ్యర్ధుల వయో పరిమితి, విద్యార్హతలు, శిక్షణ, రిజర్వేషన్ల కోటాకు సంబంధించి అలహాబాద్‌, ఛత్తీస్‌ఘడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, ఒరిస్సా, ఉత్తరాఖండ్‌ హైకోర్టులు సూచించాయని మంత్రి చెప్పారు.

కాగా ఏఐజేఎస్‌ ఏర్పాటును అరుణాచల్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పంజాబ్‌ రాష్ట్రాలు వ్యతిరేకించగా.. బీహార్‌, ఛత్తీస్‌ఘడ్‌, మణిపూర్‌, ఒడిషా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు మాత్రం దీని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో మార్పులు చేయాలని సూచించాయని ఆయన తెలిపారు. ఈ విధంగా ఏఐజేఎస్‌ ఏర్పాటు ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన దృష్ట్యా ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం తిరిగి సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top