వైద్యశాఖపై విజి‘లెన్స్‌’

Vigilance Eye On medical Department Krishna - Sakshi

ఇన్‌కంట్యాక్స్‌ నుంచి మినహాయింపునకు తప్పుడు పత్రాలు సమర్పణ

ఒక్కో ఉద్యోగి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ పన్ను రాయితీ  పొందిన వైనం

ఆదాయపు పన్ను మినహాయింపునకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు అడ్డదారి తొక్కి అడ్డంగా దొరికిపోయారు. ప్రైవేటు బ్యాంకుల నుంచి గృహరుణాలు పొందినట్లు కొందరు ఉద్యోగులు సమర్పించిన తప్పుడు అఫిడవిట్‌లపై విజిలెన్స్‌ శాఖ విచారణ చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (డీఎంఅండ్‌హెచ్‌ఓ) పరిధిలో పనిచేసే ఉద్యోగులతో పాటు,  మలేరియా విభాగం, సిద్ధార్థ వైద్య కళాశాల, దంత వైద్య కళాశాల, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 50 మంది తప్పుడు పత్రాలు దాఖలు చేసినట్లు తేల్చారు. ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే ఈ గుట్టు రట్టయిందని సమాచారం.

లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఆదాయపు పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు  వైద్య ఆరోగ్యశాఖలో కొందరు ఉద్యోగులు చేసిన అవకతవకలపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. రుణాలు తీసుకున్నామంటూ గుట్టుగా సమర్పించినవన్నీ తప్పుడు పత్రాలేనని నిర్థారించారు. ప్రస్తుతం 50 మంది ఉద్యోగులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. మరింత మంది ఉండవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా మలేరియా విభాగంలో ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఈ బాగోతం బహిర్గతమైంది. ఆదాయపు పన్ను మినహాయింపునకు తప్పుడు పత్రాలు సమర్పించిన గుట్టు బయటకు పొక్కింది. కొందరు ఉద్యోగులు తప్పుడు పత్రాలతో పన్ను మినహాయింపు పొందుతున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు, విజిలెన్స్‌కు లేఖలు రాశారు. దీంతో ఫిర్యాదులు వచ్చిన ఉద్యోగులను విజిలెన్స్‌ విచారణ ప్రారంభించగా ఒక్కొక్కటీ వెలుగులోకి వచ్చింది. విచారణ కోసం వచ్చిన ఉద్యోగులు తామే కాదు... మరింత మంది అలా తప్పుడు పత్రాలు సమర్పించారని పేర్కొనడంతో  ఆ జాబితా రోజు రోజుకు చాంతాడులా పెరుగుతూ వచ్చింది. మలేరియాతో పాటు, డీఎం అండ్‌ హెచ్‌ఓ పరిధిలోని సిబ్బంది, విజయవాడ ప్రభుత్వాస్పత్రి, దంత వైద్య కళాశాల, ఈఎస్‌ఐ ఆస్పత్రి, సిద్ధార్థ వైద్య కళాశాలల్లోని పలువురు ఉద్యోగులు ఇలాంటి తప్పుడు పత్రాలు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చాయి.

ఏటా అంతే....
వైద్య ఆరోగ్యశాఖలో నెలకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకూ జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు ఆదాయపు పన్ను పరిధిలోకి  రావడంతో పన్ను నుంచి మినహాయింపు కోసం దొడ్డిదారులు వెతికారు. ప్రైవేటు బ్యాంకుల నుంచి రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ రుణాలు పొందినట్లు అఫడవిట్‌లు సృష్టించి ఒక్కో ఉద్యోగి రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ పన్ను రాయితీ పొందినట్లు చెబుతున్నారు.

నాలుగేళ్ల వివరాల సేకరణ...
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల నాలుగేళ్ల ఆదాయపు పన్ను వివరాలు తమకు తెలియపర్చాలంటూ విజిలెన్స్‌ విభాగం ఆయా శాఖల అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులను కోరింది. అందులో భాగంగా 2013–14, 2014–15, 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల డేటా ఇవ్వాలని ఆదేశించారు. రెండు రోజుల కిందట ప్రభుత్వాస్పత్రి, డెంటల్‌ కళాశాల, సిద్ధార్థ వైద్య కళాశాలల్లో తనిఖీలు చేసిన విజిలెన్స్‌ డీఎస్పీ విజయపాల్, మరలా మంగళవారం రానున్నట్లు సమాచారం. అప్పటికి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారని తెలిసింది. మలేరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో తప్పుడు పత్రాలు సమర్పించిన ఉద్యోగులను ఇప్పటికే గుర్తించారు. దీంతో పలువురు ఉద్యోగులు రికవరీ పొందిన మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించేసినట్లు తెలిసింది. ఈ విషయమై విజిలెన్స్‌ అధికారులను వివరణ కోరగా, విచారణలో ఉన్నందున వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top