బాబుది నయవంచన | vasi reddy padma fires on chandra babu naidu | Sakshi
Sakshi News home page

బాబుది నయవంచన

Dec 30 2013 3:02 AM | Updated on Jul 28 2018 6:43 PM

బాబుది నయవంచన - Sakshi

బాబుది నయవంచన

రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు ‘సమైక్యంగా’ ఉంచాలని గర్జిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఓట్లు, సీట్ల కోసం నయవంచనకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది.

      వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
     వాసిరెడ్డి పద్మ, రాజేష్
     అధికారం కోసం బాబుకు
     ఓట్లు, సీట్లపైనే యావ అని విమర్శ
     రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందుకు కోరరని ప్రశ్న
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు ‘సమైక్యంగా’ ఉంచాలని గర్జిస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఓట్లు, సీట్ల కోసం నయవంచనకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. తిరుపతి ‘ప్రజాగర్జన’ సభలో చంద్రబాబు గంటన్నరకుపైగా ఉపన్యసించినా.. ఎక్కడా ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం నాడిక్కడ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు ఎందుకు కోరుకుంటున్నారని వారు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ, ఇతరులను తిడుతున్న చంద్రబాబు.. ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఆయనిచ్చిన లేఖ సంగతేంటి? అని నిలదీశారు.
 
 తెలుగువారికి అన్యాయం జరుగుతోందంటున్న బాబు.. ఆయన చేసిన అన్యాయాన్ని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు విభజన రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ‘‘రాష్ట్రపతి వద్దకు ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలను పంపించారు. అదే రాష్ట్రపతిని చంద్రబాబు రహస్యంగా కలిసి వస్తారు. మరోమారు సీమాంధ్రకు చెందిన నేతలను కూడా రాష్ట్రపతి దగ్గరకు పంపుతున్నారు. ప్రాంతాల వారిగా ఎమ్మెల్యేలను, నాయకులను చీల్చి, రాజకీయాలను చంద్రబాబు ఎందుకింత నీచంగా దిగజార్చుతున్నారు?’’ అంటూ దుయ్యబట్టారు. ఇన్నాళ్లు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతాలంటూ విచిత్ర వాదనలు చేసిన చంద్రబాబు.. తిరుపతి సభలో ప్రజలను కోతులుగా చిత్రీకరించి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. బాబు తీరు చూస్తుంటే ‘రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి మాదిరిగా.. ఈ నారా చక్రవర్తి చిడతలు వాయించారు’ అని ఎద్దేవా చేశారు.
 
 బాబు అవకాశవాదానికి ఇదే నిదర్శనం: గతంలో వినాయకచవితి ఉత్సవాలకు హైదరాబాద్‌కు నరేంద్రమోడి వస్తానంటే, మోడీ రావడానికి వీల్లేదంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబే ఈరోజు మోడీని పొగడం చూస్తుంటే బాబు అవకాశవాదం, రెండు నాల్కల ధోరణికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉంటుందా?’ అని పద్మ, రాజేష్ ప్రశ్నించారు. ప్రజలు ఎన్టీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెబుతున్న చంద్రబాబు.. మరి ఆయన తొమ్మిదేళ్ల పాలన తిరిగి తీసుకొస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారని సూటిగా అడిగారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే, ఆయన నుంచి అధికారం లాగేసుకున్న బాబు ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాపులు నెలకొల్పిన మాట వాస్తవంకాదా? అని అన్నారు.  ‘‘తొమ్మిదేళ్లపాటు బాబు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశారు? ఏ ఒక్కరోజైనా ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? ప్రాజెక్టులు ఒక్కటైనా నిర్మించారా? పంట రుణాల గురించి మాట్లాడుతున్న మీరు, మీ హయాంలో కనీసం వడ్డీ అయినా మాఫీ చేశారా?’’ అని ప్రశ్నిం చారు. ఆయన పాలనలో విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెరగలేదని చెప్పడం, 24 గంటలపాటు విద్యుత్ ఇచ్చానని చెప్పడం సిగ్గుచేటన్నారు. అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడడం చూస్తుంటే.. ‘ఒసామాబిన్‌లాడెన్ బతికుంటే శాంతివచనాలు వల్లించినట్లు’గా ఉంటుందని ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement