పాపం.. క్షీరదాలు!

Using Oxytocin Injections to Buffaloes For Milk - Sakshi

విషంగా మారుతున్న పాలు

అధిక ఉత్పత్తికోసం ఆక్సిటోసిన్‌ వేస్తున్న పాల ఉత్పత్తిదారులు

ఆ పాలు తాగినవారికి క్యాన్సర్‌ వంటి జబ్బులు వచ్చే అవకాశం

ఈ డ్రగ్‌ని ప్రభుత్వం నిషేధించినా యథేచ్ఛగా అమ్మకాలు

అమ్మ పాలు అమృతం.. గేదె పాలు బలవర్థకం.. ఆవు పాలు ఔషధం.. కొందరికి ఖరము పాలు పథ్యం.. పాల కడిలి నుంచే కదా అమృతం పుట్టింది. అయితే ఇప్పుడు అలాంటి పాలను కాలకూట విషంగా మార్చేస్తున్నారు. స్వార్థ బుద్ధితో.. డబ్బుపై పేరాశతో చుట్టూ ఉన్నవారు చచ్చినా.. గేదెలు కృశించి పోయినా కావాల్సింది పచ్చనోట్లే.. వాటినే తింటారేమో.. ఛీ...

సాక్షి, చీరాల (ప్రకాశం): అన్నింటి కంటే పాలు స్వచ్ఛంగా ఉంటాయని అందరి విశ్వాసం. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం పాల వెనుక కూడా విషం అనే నిజం పడగెత్తుతోంది. తెల్లటి పాల నురగలో విషం కూడా దాగి ఉందనేని నమ్మశక్యం కాని నిజంగా మారింది. స్వార్థం కోసం పాలను విషతుల్యం చేస్తున్నారు. అవి తాగిన వారు అనేక వ్యాధులకు గురవుతుండగా పశువులు వ్యాధుల బారిన పడి కబేళాలకు తరలి వెళ్తున్నాయి. పశుపోషకులు, పాల ఉత్పత్తిదారులు గేదెల ఫాం యజమానులు పాల దిగుబడుల కోసం అర్రులు చాస్తున్నారు. దిగుబడులతో ఎక్కువ లాభాలను గడించాలనే ఆశతో పాడి గేదెలకు చెందిన దూడలని సరిపడా పాలు తాగనీయకుండా తల్లి నుంచి దూరం చేస్తున్నారు. దీంతో పిల్లలకు పాలు సరిపోక అనారోగ్యానికి గురై పుట్టిన కొన్ని నెలలకే మృత్యువాతపడుతున్నాయి.

గేదెకు పొదుగు నుంచి రొమ్ముల వరకు పాలు రావాలంటే దూడ కొద్దిసేపు పొదుగు వద్ద సేపేందుకు (దూడ పాలు లాగడం) ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ దూడలు పాలు తాగేస్తున్నాయనే ఉద్దేశంతో వాటిని వెంటనే దూరం చేస్తున్నారు. దూడ లేకుంటే మిగులు పాలన్నీ అమ్మవచ్చనే దురాలోచనతో దూడ బదులు నిషేధిత డ్రగ్‌ అక్సోటాసిన్‌ ఇంజక్షన్లను రోజుకు రెండుసార్లు గేదెలకు వేసి మొత్తం పాలు పిండుతున్నారు. ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌లో అనేక రకాల హార్మోన్లుంటాయి. గేదె సేపాలంటే దూడ కనీసం పది నిమిషాల పాటు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ రూ.5ల విలువైన ఆక్సిటోసిన్‌ ఒక్క ఇంజక్షన్‌ వేస్తే చాలు క్షణాల్లో గేదెసేపి పూర్తి అయి పొదుగు నుంచి పాలు కారిపోతాయి. అంత ప్రమాదకర హర్మోన్లు ఉండే ఈ ఇంజక్షన్లను నోరులేని జీవాలు తట్టుకోవడం చాలా కష్టం అయినా అక్రమార్కులు తమ పని మానుకోవడంలేదు.

ఆక్సిటోసిన్‌ పాలు తాగితే అనర్థాలు
పాలు తాగితే ఆరోగ్యమంటారు. కానీ ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ వాడిన గేదెల పాలు తాగితే అనేక అనర్థాలు వస్తాయని వైద్యులు అంటున్నారు. ప్రమాదకర హార్మోన్లు కలిసిన ఈ పాలు తాగితే క్యాన్సర్‌ వంటి జబ్బులు వస్తాయి. కళ్ల జబ్బులతో పాటు ఆడ పిల్లలు చిన్న వయస్సులోనే మెచ్యూర్‌ కావడం, వక్షోజాలు పెరగడంతో పాటు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన హార్మోన్లు ఉన్న ఈ ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ను ప్రభుత్వం పదేళ్ల క్రితంమే నిషేధించింది. ప్రమాదకరమైన హార్మోన్లు ఉన్న ఈ ఇంజక్షన్లను పాడి గేదెలకు వేయడం వలన గేదెలు యదకు రాకపోవడం, గర్భసంచి వంటి జబ్బులతో పాటు తక్కువ కాలానికే ఆ గేదెలు చనిపోతున్నాయి.

ఎక్కడ కావాలంటే అక్కడ..
ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు వాడిన గేదె పాలు తాగిన వారికి రోగాలతో పాటు పశువులు కూడా అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ ఇంజక్షన్లను ప్రభుత్వం నిషేధించింది. కానీ చాటుమాటున ఆ ఇంజక్షన్లు చెన్నై ద్వారా మన రాష్ట్రానికి తరలించి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. చీరాలలోని బెస్తపాలెం వద్ద ఉన్న ఒక పశువుల మెడికల్‌ షాపు, నల్లగాంధీ బొమ్మసెంటర్‌తో పాటు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇవి పుష్కలంగానే దొరుకుతున్నాయి. నిషేధిత డ్రగ్‌ను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయినా డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు మూమూళ్ల మత్తులో పడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

పశువులకు ప్రమాదకరం
ప్రొట్యూటరీ అనే గ్రంథి ద్వారా ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ ఇంజక్షన్లు తయారవుతాయి. ప్రమాదకరమైన హార్మోన్లు ఉండటం వలన గేదెలు తట్టుకోలేక ఎదకు రాకపోవడం, గర్భం దాల్చినా మధ్యలోనే చనిపోయిన దూడలను వదలడంతో పాటు గర్భాశయం చుట్టూ ఉన్న కండరాలు వదులై గర్భాశయ సమస్యలు ఏర్పడతాయి.
- పశువైద్యాధికారి టి.శివారెడ్డి

ప్రమాదకరం
ఆక్సీటోసిన్‌ పాలలో రోగాలను కలుగజేసే క్రిములు చాలా ఉంటాయి. ఆ క్రిములు శరీరంలోకి వెళితే అనారోగ్య పాలవడం ఖాయం. అటువంటి ఇంజక్షన్‌లు గేదెలకు వేసిన క్షణంలోనే గేదె పొదుగు నిండి పాలు కారుతుంటాయి.
– పి. జయమ్మ

సహజసిద్ధమైన పాలు శ్రేష్టం
సహజ సిద్ధమైన పాలను మాత్రమే తాగాలి. ముఖ్యంగా చిన్న బిడ్డలకు బయట దొరికే పాలను పట్టించకూడదు. ఇంజక్షన్‌లు వేసిన పాలు ప్రమాదకరం. అధికారులు తగిన చర్యలు తీసుకుని అక్రమార్కులను అరికట్టాలి.
–పి. మాధవి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top