కేంద్ర హోంశాఖ సీరియస్‌!?

Union Home Ministry Serious on Amit Shah issue - Sakshi

     అలిపిరి ఘటనపై నివేదిక కోరిన అధికారులు

     బాధ్యులైన అధికారులపై వేటు?

     కీలకపాత్ర పాత్రధారులపై ఆరా

సాక్షి ప్రతినిధి, తిరుపతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై శుక్రవారం జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి సంబంధించి ఏపీ పోలీస్‌ శాఖను నివేదిక కోరినట్లు తెలిసింది. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకపోతే ఎలాగని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను పంపాల్సిందిగా తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్‌ మొహంతిని ఏపీ పోలీస్‌ ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, టీడీపీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన నాయకులు ఎవరెవరు, ఈ ఘటనలో ఎవరెవరు కీలకపాత్ర పోషించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాన్వాయ్‌లో వెనుక ఉన్న వాహనాలకు అనుమతి ఉందా లేదా అన్న అంశాన్నీ పరిశీలిస్తున్నారు. మరోవైపు.. విధుల్లో ఉన్న పోలీసు అధికారుల వైఫల్యాన్ని చూపుతూ ఒకరిద్దరిపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో రికార్డు అయిన వీడియో ఫుటేజీలు, ఫొటోలు తెప్పించుకుని విశ్లేషిస్తున్న అధికారులు బాధ్యులైన సీఐ, డీఎస్పీలపై బదిలీ వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top