టీడీపీలో రాజుకుంటున్నటిక్కెట్ల చిచ్చు | Unhappy With Distribution Of Tickets in TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో రాజుకుంటున్నటిక్కెట్ల చిచ్చు

Mar 16 2019 1:52 PM | Updated on Mar 16 2019 2:08 PM

Unhappy With Distribution Of Tickets in TDP - Sakshi

సాక్షిప్రతినిధి, విజయనగరం: అందరూ ఊహించినట్టే టీడీపీలో టిక్కెట్ల చిచ్చు రాజుకుంటోంది. సిట్టింగ్‌లపై సొంత పార్టీలోనే తలెత్తిన అసంతృప్తిని పట్టించుకోని అధినేత వైఖరిపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందరు వద్దంటున్నా... వారికే ఎలా టిక్కెట్లు కేటాయిస్తారంటూ భగ్గుమంటోంది. చీపురుపల్లిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తనయుడికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆ నియోజకవర్గ అసమ్మతినేతలు శనివారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇంకా పార్వతీపురం... విజయనగరం... తదితర నియోజకవర్గాల్లోనూ ఆందోళనకు కేడర్‌ సిద్ధమవుతోంది.

తెలుగుదేశం పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత అసంతృప్తి జ్వాలలు మరింతగా రేగుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీలో అంతర్గత విభేదాలు ఎన్నికల నేపథ్యంలో బహిర్గతమయ్యాయి. టిక్కెట్ల కేటాయింపునకు ముందే తన్నుకున్న టీడీపీ నేతలు బెర్త్‌ కన్ఫమ్‌ అయిన తర్వాత కూడా శాంతించడం లేదు. చీపురుపల్లిలో మాజీ ఇన్‌చార్జ్‌ త్రిమూర్తులురాజు, ఎంపీపీ భర్త కామునాయుడు, జెడ్పీటీసీ వరహాలనాయుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బలగం కృష్ణ, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్‌ ఏకంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంతేనా... భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. 

పార్వతీపురంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ తమ్ముడు, మాజీ కౌన్సిలర్‌ ద్వారపురెడ్డి శ్రీనివారావు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో తెలపాలని ప్రశ్నించారు. తనను పార్టీ పట్టణ అధ్యక్షుడు సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించి దాదాపు నెలరోజులు కావస్తున్నా తనకు సస్పెన్షన్‌ ఆర్డర్‌ ఇవ్వకపోవడంతో తాను పార్టీలో ఉన్నాననే భావిస్తున్నారా లేననుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఉన్నట్‌లైతే తనను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి ఇప్పటికే పార్టీపై తన వ్యతిరేకతను బయటపెట్టారు. 

విజయనగరంలో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్‌ గజపతిరాజుకు వ్యతిరేకంగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతకు మద్దతుగా చర్చలు జరిపారు. అశోక్‌ గజపతి తన కుమార్తె అదితిని నిలబెడతానని ఏనాడూ ఎక్కడా టీడీపీ కేడర్‌తో చర్చించలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా ఆమెను తెరపైకి ఎలా తెస్తారంటూ రగిలిపోయారు. బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన గీతను కాదని అదితికి టిక్కెట్టు ఎలా ఇస్తారని, తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన నేతకే టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు టిక్కెట్టు లభించడంతో ఆయన తమ్ముడు బేబీనాయన తీవ్రంగా మనస్థాపం చెందారు.

అన్నదమ్ముల మధ్య వైరం మరింతగా పెరిగి, వారి రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపే స్థాయికి వెళ్లింది. పార్టీ కోసం, అన్న కోసం ఇప్పటికే చేతి చమురు చాలానే వదిలించుకున్న బేబీ నాయన, తనకు చివరికి అప్పులే మిగిలాయని అన్నతో వాగ్వాదానికి దిగారు. దీంతో కుటుంబ పెద్దలు ఇరువురి మధ్య ఆర్ధిక సెటిల్‌మెంట్‌కు ప్రయత్నిస్తున్నారు. అది కూడా ఇంకా పూర్తికాకపోవడంతో బొబ్బిలి రాజుల కోటలో నిశ్శబ్దం అలముకుంది.

మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అసమ్మతి నేతలు బయటపడలేదు. కానీ కురుపాం నియోజకవర్గం నుంచి తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఆశించిన శత్రుచర్ల విజయరామరాజు, చంద్రశేఖరరాజు జనార్దన్‌ థాట్రాజ్‌కు ఏమాత్రం సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. సాలూరులో ఆర్‌పి భంజ్‌దేవ్‌ నాయకత్వాన్ని అక్కడి మహిళా నేత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఇప్పటికే వ్యతిరేకిస్తుండగా, ఆమె వర్గం నేతలు, కార్యకర్తలు భంజ్‌దేవ్‌ ఓటమికి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. గజపతినగరంలో కె.ఎ.నాయుడికి అతని అన్న రూపంలో అసమ్మతి వెంటాడుతూనే ఉంది. కోళ్ల లలిత కుమారితో కలిసినట్లు కనిపిస్తున్న శోభా హైమావతి, ఆమె కుమార్తె శోభా స్వాతిరాణికి టీడీపీ చేసిన అన్యాయం కారణంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆ ప్రభావం కోళ్లపైనే పడనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement