breaking news
sanjay krishna ranga rao
-
టీడీపీలో రాజుకుంటున్నటిక్కెట్ల చిచ్చు
సాక్షిప్రతినిధి, విజయనగరం: అందరూ ఊహించినట్టే టీడీపీలో టిక్కెట్ల చిచ్చు రాజుకుంటోంది. సిట్టింగ్‌లపై సొంత పార్టీలోనే తలెత్తిన అసంతృప్తిని పట్టించుకోని అధినేత వైఖరిపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇందరు వద్దంటున్నా... వారికే ఎలా టిక్కెట్లు కేటాయిస్తారంటూ భగ్గుమంటోంది. చీపురుపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆ నియోజకవర్గ అసమ్మతినేతలు శనివారం తమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇంకా పార్వతీపురం... విజయనగరం... తదితర నియోజకవర్గాల్లోనూ ఆందోళనకు కేడర్ సిద్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత అసంతృప్తి జ్వాలలు మరింతగా రేగుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీలో అంతర్గత విభేదాలు ఎన్నికల నేపథ్యంలో బహిర్గతమయ్యాయి. టిక్కెట్ల కేటాయింపునకు ముందే తన్నుకున్న టీడీపీ నేతలు బెర్త్ కన్ఫమ్ అయిన తర్వాత కూడా శాంతించడం లేదు. చీపురుపల్లిలో మాజీ ఇన్చార్జ్ త్రిమూర్తులురాజు, ఎంపీపీ భర్త కామునాయుడు, జెడ్పీటీసీ వరహాలనాయుడు, జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణ, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, మెరకముడిదాం మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద్ ఏకంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అంతేనా... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. పార్వతీపురంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తమ్ముడు, మాజీ కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీనివారావు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో తెలపాలని ప్రశ్నించారు. తనను పార్టీ పట్టణ అధ్యక్షుడు సస్పెండ్ చేసినట్లు ప్రకటించి దాదాపు నెలరోజులు కావస్తున్నా తనకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వకపోవడంతో తాను పార్టీలో ఉన్నాననే భావిస్తున్నారా లేననుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఉన్నట్లైతే తనను పార్టీ కార్యక్రమాలకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి ఇప్పటికే పార్టీపై తన వ్యతిరేకతను బయటపెట్టారు. విజయనగరంలో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా, సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు మద్దతుగా చర్చలు జరిపారు. అశోక్ గజపతి తన కుమార్తె అదితిని నిలబెడతానని ఏనాడూ ఎక్కడా టీడీపీ కేడర్‌తో చర్చించలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా ఆమెను తెరపైకి ఎలా తెస్తారంటూ రగిలిపోయారు. బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గానికి చెందిన గీతను కాదని అదితికి టిక్కెట్టు ఎలా ఇస్తారని, తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన నేతకే టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు టిక్కెట్టు లభించడంతో ఆయన తమ్ముడు బేబీనాయన తీవ్రంగా మనస్థాపం చెందారు. అన్నదమ్ముల మధ్య వైరం మరింతగా పెరిగి, వారి రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపే స్థాయికి వెళ్లింది. పార్టీ కోసం, అన్న కోసం ఇప్పటికే చేతి చమురు చాలానే వదిలించుకున్న బేబీ నాయన, తనకు చివరికి అప్పులే మిగిలాయని అన్నతో వాగ్వాదానికి దిగారు. దీంతో కుటుంబ పెద్దలు ఇరువురి మధ్య ఆర్ధిక సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్నారు. అది కూడా ఇంకా పూర్తికాకపోవడంతో బొబ్బిలి రాజుల కోటలో నిశ్శబ్దం అలముకుంది. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అసమ్మతి నేతలు బయటపడలేదు. కానీ కురుపాం నియోజకవర్గం నుంచి తమ కుటుంబ సభ్యులకు టిక్కెట్టు ఆశించిన శత్రుచర్ల విజయరామరాజు, చంద్రశేఖరరాజు జనార్దన్ థాట్రాజ్‌కు ఏమాత్రం సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే. సాలూరులో ఆర్పి భంజ్‌దేవ్ నాయకత్వాన్ని అక్కడి మహిళా నేత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఇప్పటికే వ్యతిరేకిస్తుండగా, ఆమె వర్గం నేతలు, కార్యకర్తలు భంజ్‌దేవ్ ఓటమికి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. గజపతినగరంలో కె.ఎ.నాయుడికి అతని అన్న రూపంలో అసమ్మతి వెంటాడుతూనే ఉంది. కోళ్ల లలిత కుమారితో కలిసినట్లు కనిపిస్తున్న శోభా హైమావతి, ఆమె కుమార్తె శోభా స్వాతిరాణికి టీడీపీ చేసిన అన్యాయం కారణంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆ ప్రభావం కోళ్లపైనే పడనుంది. -
సైనికుల్లా కదంతొక్కండి
బొబ్బిలి, న్యూస్‌లైన్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడ మే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో ప్రచార విభాగం సమర్థంగా పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు సూచించారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంకోసం ప్రవేశపెట్టనున్న పథకాల గురించి ఇటీవల జరిగిన ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి వివరించారని, వాటి వల్ల సామాన్య ప్రజలకు మేలు జరగుతుందన్నారు. పార్టీ పట్టణ ప్రచార కమిటీ అధ్యక్షునిగా నియమించినందుకు లంక వాసుదేవరావు శుక్రవారం సుజయ్‌కృష్ణ రంగారావు, బేబీనాయనలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు అభినందనలు తెలిపిన అనంతరం సుజయ్, బేబీనాయనలు మాట్లాడుతూ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలుచేశారో, ఆ స్థాయిలో జగన్మోహన్రెడ్డి కూడా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను ప్రజల వద్దకు చేర్చే బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు. అందుకు ప్రచార కమిటీలు సమర్థంగా పనిచేయాలన్నారు. అలాగే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రాన్ని విభజించేందుకు నిత్యం కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి మధ్య ఉండే తేడాను ప్రజలు గమనించే విధంగా ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్ల ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడి పనిచేయాలన్నారు. ప్రజల్లో నిత్యం ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నవారికి అధిష్టానం తప్పక గుర్తిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమాన సంఘ నాయకులు బొంగు సంతోష్‌కుమార్, బర్లి ప్రకాశరావు, ఖాన్, అల్లూరి జానకిరామరాజు, గంగుల సుధాకర్ తదితరులున్నారు.