'బోరు'మంటున్నాయి

Underground water levels Down In Kurnool District - Sakshi

మరమ్మతులకు నోచుకోని చేతిపంపులు

వేధిస్తున్న మెకానిక్‌ల కొరత

నిధులను మింగేస్తున్న అధికారులు

బోర్ల సామగ్రి సొంత అవసరాలకువాడుకుంటున్న సర్పంచులు

తాగునీటి సమస్యతో అల్లాడుతున్న గ్రామీణ ప్రజలు

సరైన వానలు లేక యేటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోర్లు, బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం వచ్చిందంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.  కొన్ని గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు మంచి నీరు కూడా దొరకని పరిస్థితి. కనీసం చేతిపంపు నీటితోనైనా గొంతు తడుపుకుందామనుకుంటే అవి మొరాయిస్తున్నాయి. యేటా వీటి మరమ్మతులకు  నిధులు మంజూరువుతున్నాయి. వాటిని అధికారులు  ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఏమో తెలియదు కానీ స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి.

ఆళ్లగడ్డ:  చేతిపంపుల మరమ్మతుల పేరుతో అధికారులు ధన దాహం తీర్చుకుంటున్నారు. కొంత మంది నాయకులు వీరికి సహకరిస్తున్నారు. జిల్లాలో 54 మండలాల్లో 821 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, ఆత్మకూరు,  మున్సిపాలిటీలు, ఆళ్లగడ్డ, గూడూరు, కోడుమూరు, నందికొట్కూరు నగర పంచాయతీలున్నాయి. వీటన్నింటిలో మొత్తం 25,542 చేతిపంపులున్నాయి. వీటితో పాటు మోటార్ల ద్వార నీరందించే బోర్లు మరో 1000 దాకా ఉన్నాయి. వాస్తవంగా ప్రతి 250 బోర్లకు ఒక మెకానిక్‌ ఉండాలి.   500 బోర్లకు కూడా  ఒక మెకానిక్‌ లేడు. 54 మండలాలలకు కలిపి 14 మందే ఉన్నారు. దీంతో చేతిపంపుల నీటిపైనే ఆధారపడే  ఆళ్లగడ్డ, కోవెంలకుంట్ల, నంద్యాల వంటి  ప్రాంతాల్లో   పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ మరమ్మతులకు గురైన చేతిపంపులు  బాగు చేయాలంటే సంవత్సరాలు పడుతోంది. మోకానిక్‌ల కొరత ఒక కారణమైతే వచ్చిన నిధులు కొందరు అధికారులు, అధికారపార్టీ నాయకులు మధ్యలోనే స్వాహా చేయడం మరో కారణంగా కనిపిస్తోంది.

నిధులు కరిగిపోయినా.. మెరుగవ్వని బోర్లు
జిల్లాలో మొత్తం 25 వేల దాక బోర్లుండగా వీటిలో చాలా బోర్లు చిన్నచిన్న మరమ్మతులతో నిరుపయోగంగా మారాయి . అయితే వీటిని ఉపయోగం లోకి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడిని తీర్చాలనే లక్ష్యంతో ఒక్కో బోరుకు ఏడాదికి రూ. 2 వేల ( ఆరు నెలల కోసారి 1000)  చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి  ఒక్కో బోరుకు రూ. 1000 చొప్పున   జనవరి నెలలోనే  ఎంపీడీఓల ఖాతాల్లో  నిధులు జమ అయ్యాయి. జిల్లా మొత్తానికి రూ. 2.5 కోట్లు నిధులు విడుదలైనట్లు సమాచారం. వీటితో అదనపు పైపులు, బోరు మరమ్మతులు, మెకానిక్‌ (కాంట్రాక్ట్‌)ల కూలీ ఖర్చులకు వెచ్చించాలి. కానీ చాలా చోట్ల బోర్ల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

సొంత అవసరాలకు సామగ్రి  
జిల్లాలోని అనేక మంది అధికార పార్టీకి చెందిన సర్పంచులు చేతిపంపులకు అదనపు పైపులు అవసరమని తీసుకెళ్తున్నారు. తర్వాత వాటిని వేయకుండా తమ సొంతానికి వాడుకుంటున్నారు. కొందరు  పశువుల పాకలకు, రేకుల షెడ్డుకు ఉపయోగించుకుంటున్నారు.  ఈవిషయం అధికారులు తెలిసినా చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top