
ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్
సాక్షి, కాకుమాను: మహానేత వైఎస్సార్ సువర్ణపాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ చూడబోతున్నారని పంచాంగకర్తలు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో జననేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. ఉగాది పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన వేడుకల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని పురోహితులు ఆశీర్వదించారు. ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద జరిగిన ఈ వేడుకల్లో పలువురు పండితులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీకి 135 సీట్లు ఖాయం : విళంబి అంటే పొడవైనదనే అర్థం వస్తుందని, అధికమాసాలు ఎక్కువ ఉన్నందున దీనిని పొడవైన సంవత్సరంగా భావించవచ్చని పంచాంగకర్తలు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వైఎస్ జగన్ జాతకంలోని సమస్యలన్నీ తీరిపోతాయని, అటుపై రాజయోగం పడుతుందన్నారు. 2019లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, వైఎస్సార్‌సీపీకి 135 సీట్లు వస్తాయని తెలిపారు. జగన్‌కు, రాష్ట్రానికి మంచి జరుగాలనే ఉద్దేశంతో సహస్త్రచండీయాగం తలపెట్టామని, రెండేళ్లపాటు యాగం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక జగన్ పూర్ణాహుతి కోసం వస్తారని స్వాములు శుభం పలికారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పిన వైఎస్ జగన్.. ఇంటింటా మంచి జరగాలని కోరుతున్నానన్నారు.