మండలంలోని కందివలస జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పూసపాటిరేగ : మండలంలోని కందివలస జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకలను పూసపాటిరేగ మండలం కందివలస జంక్షన్ సమీపంలో వెనుకనుంచి వస్తున్న లారీ బలంగా ఢీకొంది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన కంచిరెడ్డి సత్యనారాయణ(25), అదే మండలం ఇల్లంనాయుడువలసకు చెందిన బెజ్జిపరపు కృష్ణారావు(26) తీవ్ర గాయాలపాలై సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సత్యనారాయణ పెనుబాకలో పాల డెయిరీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మృతదేహాలకు పంచనామా నిర్వహించి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు పూసపాటిరేగ ఎస్సై ఎస్.శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.