ఇద్దరు డీఎస్పీల బదిలీ | Two DSPs transferred | Sakshi
Sakshi News home page

ఇద్దరు డీఎస్పీల బదిలీ

Oct 7 2017 11:26 AM | Updated on May 25 2018 6:07 PM

Two DSPs transferred - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో పనిచేస్తున్న ఏలూరు, నరసాపురం డీఎస్పీలను బదిలీ చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ అడిషనల్‌ డీజీ హరీష్‌ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు డీఎస్పీగా పనిచేస్తున్న గోగుల వెంకటేశ్వరరావును బదిలీ చేసి ఆయన స్థానంలో సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న కె.ఈశ్వరరావును నియమించారు. నరసాపురం డీఎస్పీగా ఉన్న జి.పూర్ణచంద్రరావును బదిలీ చేసి ఆయన స్థానంలో ఇంటిలిజెన్స్‌ విభాగం సీఐగా పనిచేస్తున్న టి. ప్రభాకర్‌బాబును నియమించారు.

 ఏలూరు, నరసాపురం డీఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. నరసాపురం డీఎస్పీగా పూర్ణచంద్రరావు సుమారు రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అయితే ఇటీవల గరగపర్రులోని దళితులను వెలివేత రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడానికి అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు కారణమని ఉన్నతాధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఆయనను బదిలీ చేస్తారంటూ చర్చ జరుగుతూ వచ్చింది. అలానే ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు గడిచింది.

 గతం నుంచి జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న  వెంకటేశ్వరరావు ఏలూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎప్పుడూ జరగని విధంగా హత్యలు జరగడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులతో ఆయన ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు, క్రికెట్‌ బుకీల దగ్గర నుంచి డీఎస్పీ పేరు చెప్పి ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ నెలవారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు డీజీపీకి అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బదిలీ జరిగినట్టు సమాచారం.

బాధ్యతలు స్వీకరించిన ఈశ్వరరావు
ఏలూరు (సెంట్రల్‌) : ఏలూరు డీఎస్పీగా కె.ఈశ్వరరావు  శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నంకు చెందిన ఆయన 2010లో డీఎస్పీగా ఎంపికయ్యారు. కొంతకాలంగా సీఐడీ విభాగంలో పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement