రెండు రోజుల క్రితమే..

రెండు రోజుల క్రితమే..


తిరుపతి: రెండు రోజుల క్రితం వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన ఓ స్మగ్లర్ 500 మంది తమిళ కూలీలను శేషాచల అడవుల్లో దింపినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ కూలీలను పంపడంలో చిత్తూరుకు చెందిన ఓ ప్రధాన స్మగ్లర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 100 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయచోటి, చిత్తూరుకు చెందిన స్మగ్లర్లను వదిలేసి కేవలం ఎర్రచందనం కూలీలను కాల్చి చంపడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సోమవారం రాత్రి అడవిలోనే బసచేసి వారి అడుగుజాడల ఆధారంగా ఎక్కడ ఉన్నారో కనుగొని మట్టుపెట్టారన్న వాదన కూడా పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.రాత్రే అదుపులోకి తీసుకున్నారా?సోమవారం రాత్రే అటవీ శాఖ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. వారిని పుత్తూరు నుంచి ఇక్కడికి తరలించారని, వారి వద్ద బస్సు టికెట్లు కూడా లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికే ఆధారాలు సేకరించిన డీఐజీ, ఐజీలు టాస్క్‌ఫోర్స్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.మంత్రి చెప్పారు.. కాల్చేశారు: అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు కన్పిస్తే కాల్చివేస్తామని పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారు చెప్పిన మాటలను పోలీసులు నిజం చేశారు. కూలీలను అడవిలోకి దింపిన ఇద్దరు ప్రధాన స్మగ్లర్లను వదిలేసి అమాయక కూలీలను కాల్చి చంపడంపై తమిళనాడులో తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన తీరు పరిశీలించిన కొందరు అధికారులు వారికి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు కూడా దీనిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top