ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో మూడున్నర నెలల బాలుడు మృతిచెందాడు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో మూడున్నర నెలల బాలుడు మృతిచెందాడు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఎం.లక్ష్మణ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం భార్య వసంత, కుమారుడు గిరిధర్, అత్తమామలు భాగ్యమ్మ, భీరప్ప, వారి కోడలు కీర్తనలతో కలసి ఇండికా కారు (ఏపీ10ఏకే 8984)లో మెదక్ జిల్లా పాటిఘణపూర్ దేవాలయానికి వెళ్లారు. అనంతరం లంగర్‌హౌస్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
ఆ సమయంలో వట్టినాగులపల్లి శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ లారీ ఆగి ఉంది. లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ముందు టైర్ పగిలిపోవడంతో అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది, దీంతో గిరిధర్(మూడున్నర నెలలు), భాగ్యమ్మ (55), కీర్తన(18)లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా గిరిధర్ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. వసంత, భీరప్ప, మరో ఇద్దరు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భాగ్యమ్మకు పక్కటెముకలు విరిగిపోగా, కీర్తనకు ముఖంపై తీవ్రగాయాలయ్యాయి.