మావాళ్లు మంచి వాళ్లే

ఆత్మ సంతకంపై విచారణ

తప్పంతా ప్రైవేటు వ్యక్తులదేనన్న రవాణాధికారులు

న్యాయవాది, ఫైనాన్షియర్‌పై పోలీసులకు ఫిర్యాదు

పోలీసు దర్యాప్తులో తేలుతుందన్న డీటీసీ శివరాంప్రసాద్‌

నెల్లూరు (టౌన్‌): రవాణాశాఖ అధికారులు చనిపోయిన వ్యక్తి పేరుపై బైక్‌ రిజిస్ట్రేషన్‌ చేయడంపై ఈ నెల 17న ‘సాక్షి’లో ‘ఆత్మ సంతకం పెట్టిందేమో’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనంపై విచారణ చేపట్టిన రవాణా శాఖ అధికారులు   మా వాళ్లు మంచివాళ్లే.. తప్పంతా న్యాయవాది, ఫైనాన్షియర్‌దేనని తేల్చారు. రవాణా అధికారులు, గుమస్తాల తప్పేమిలేదని, కేవలం ప్రైవేటు వ్యక్తుల కారణంగానే తప్పిదం జరిగిందని రిపోర్టు తయారు చేసి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వాహనం ట్రాన్స్‌ఫర్‌ సమయంలో సంబంధిత యజమాని ఆధార్‌కార్డుతో నేరుగా రవాణా కార్యాలయంలో అధికారుల ముందు సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన వ్యక్తి ఆధార్‌ను పరిశీలించకుండానే రవాణా అధికారి సంతకం తీసుకున్నారాని అందరు నోరు వెల్లబెడుతున్నారు.

న్యాయవాది, ఫైనాన్షియర్‌పై ఫిర్యాదు  
చనిపోయిన వ్యక్తిపై బైకును రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంపై రవాణాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై న్యాయవాది మధుసూదనరావు, సాయిగణేష్‌ ఫైనాన్స్‌ నిర్వాహకులపై 5వ నగ ర పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన తప్పుడు ధ్రువీకరణ పత్రాల కారణంగానే బైకు రిజిస్ట్రేషన్‌ జరిగిందని చెబుతున్నారు. సాధారణంగా నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనం రిజిస్ట్రేషన్‌ సమయంలో వాహన యజమాని సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి అధికారి ముందు సంతకం చేయాల్సి ఉంది. అన్ని పత్రాలు సరైనవి నిర్ధారించుకున్న తర్వాతే వాహన ఆర్‌సీ బుక్‌ను రిజిష్టర్‌ పోస్టు ద్వారా యజమాని సమర్పించిన అడ్రస్‌కు పంపిస్తారు.

అధికారులను తప్పించడంపై విమర్శలు  
మృతి చెందిన వ్యక్తి పేరుపై బైకు రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిలేదని తేల్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారితో ముందస్తు చేసుకున్న ఒప్పందంలో భాగంగానే బైకు లేకుండానే రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌ఫర్‌ చకచకా జరిగిపోయాయి. డీబీఏలో పనిచేసే ఓ వ్యక్తి ఏజెంట్‌ ద్వారా రూ.8వేలు నగదు తీýసుకుని ఉన్నతాధికారి వరకు కమీష న్‌ అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. గుమస్తానే నేరుగా బైకుకు రిజిస్ట్రేషన్‌ చేశారని ఉన్నతాధికారికి తెలిసినా అవేమి పట్టనట్లు బయట వ్యక్తులపై నెట్టడం రవాణాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైన బైకు రిజిస్ట్రేషన్‌ వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారుల ఆధ్వర్యంలో ³పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.  

పోలీసులే తేలుస్తారు
చనిపోయిన వ్యక్తి పేరు మీద బైకు రిజిస్ట్రేషన్‌ జరగడంపై విచారణ చేయాల్సిందిగా ఎంవీఐ రామకృష్ణారెడ్డిని నియమించాం. ఆయన విచారణ చేపట్టి నివేదికను అందజేశారు. నివేదిక ఆధారంగా న్యాయవాది, ఫైనాన్షియర్‌ మీద పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం.  అధికారులకు తెలియకుండా జరిగిందానే ప్రశ్నకు పోలీసుల దర్యాప్తులో  తేలుతుందని సమాధానమిచ్చారు.
– ఎన్‌.శివరాంప్రసాద్, డీటీసీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top