ఉక్కిరి బిక్కిరి..!

Train Journey Dangerous in Summer - Sakshi

తీవ్రతరమైన ఉష్ణోగ్రతలు

రైళ్లలో మొరాయిస్తున్న ఎసీలు

ఏసీ కోచ్‌లో తప్పని ఉక్కపోత

ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని రైల్వేశాఖ

వేసవిలో ప్రయాణమంటేనే భయమేస్తుంది. అందుకే చాలామంది రైళ్లలో ఏసీ కోచ్‌లలో రిజర్వేషన్‌ చేయించుకుని ప్రయాణిస్తున్నారు. ఛార్జీని కూడా లెక్క చేయకుండా రిజర్వేషన్‌ చేయించుకుంటే ఆ ఏసీలు కూడా సరిగా పనిచేయక ప్రయాణంలో అవస్థలు పడుతున్నామని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.

రాజంపేట: ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏసీ కోచ్‌లు ఉన్నాయి. ఈ కోచ్‌లో ప్రయాణం రిజర్వేషన్‌ కంటే రెట్టింపు ధర ఉంటుంది. అయినప్పటికి నేటి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణికులు ఛార్జీలు ఎక్కువైనప్పటికి వెనుకాడకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణం సాగిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందనే విమర్శలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా దేశ రాజధానికి జిల్లా మీదుగా నడిచే హంససఫర్‌ (కశ్మీరు)రైలు ఫార్మసిన్‌లోని ఏసీ కోచ్‌లో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వెంకటాద్రి, రాయలసీమ, చెన్నై–ముంబయి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌రైళ్లు, మధురై, కరేకల్, షిర్డి, బాలాజి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వీటిలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని తెలుస్తోంది.

తరచూ మొరాయిస్తున్న ఏసీలు..
వేసవిలో రైళ్ల ప్రయాణాలు జోరందుకున్నాయి. అదీ ఎక్కువగా ఏసీలో ప్రయాణాలు ఎక్కువగా సాగుతున్నాయి. అయితే పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. దీంతో నిరంతరం భానుడి సెగల మధ్య నడిచే రైళ్ల ఫార్మసిన్‌లోని ఏసీ కోచ్‌లలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఏసీ కోచ్‌లో చల్లటి వాతావరణం లేకపోవడంతో పాటు, వెలుపలి గాలి లోపలికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు.

ముందస్తు చర్యలేవీ..
ఏసీ కోచ్‌ల విషయంలో ముందస్తు చర్యలేవీ రైల్వేశాఖ చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. నేటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రతల స్థాయి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉందని ప్రయాణికులు అంటున్నారు.  రైలు బయలుదేరే సమయంలో సంబంధిత శాఖ సిబ్బంది ఏసీ కోచ్‌ల స్థితిగతులను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎండింగ్, స్టార్టింగ్‌ ప్రాంతాల్లో సీఎన్‌డబ్లు్య డిపార్టుమెంట్స్‌ ఉంటాయి. మార్గమధ్యంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇద్దరు మెకానికల్‌లు అందుబాటులో ఉంటారు. ఏసీ కోచ్‌లో సమస్యలు వస్తే అప్పటికప్పుడే పరిష్కరిస్తారు. వీరివల్ల కూడా కాని సమయంలో ఇక డిపోకు వచ్చిన తర్వాతే ఆ సమస్య పరిష్కారమవుతుంది.

ఏసీలు ట్రిప్‌..
వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పు తారస్థాయికి చేరుకుంటోంది. ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీంతో ఎల్‌హెచ్‌బీ వంటి ఆధునిక కోచ్‌లున్న రైళ్లలో ఏసీల వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటుంది. మెకానిక్‌లు ఏసీ కోచ్‌లో అందుబాటులో ఉండాలి. అయితే ఏ కోచ్‌లో మెకానిక్‌లు ఉంటారో తెలియక ప్రయాణికులు వారి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో నెలకొంటోంది.

ఏసీలు పనిచేయకుంటే..
ప్రతి రైలు ఫార్మిసిన్‌లో ఆరు నుంచి నాలుగు లోపు ఏసీ కోచ్‌లు ఉన్నాయి. ఒక్కో ఏసీ కోచ్‌లో 56 మంది ప్రయాణికులు ఉంటారు.  ఏసీలు సక్రమంగా పనిచేయడంలేదనే ఆరోపణలు ప్రయాణికుల నుంచి వెలువడుతున్నాయి. ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఫ్యాన్లను ఏసీ కోచ్‌లలో ఏర్పాటు చేయాల్సిన అంశంపై రైల్వేశాఖ దృష్టి సారించాల్సి ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top