పేదలకూ టౌన్‌షిప్‌

Township For The Poor People - Sakshi

శెట్టిపల్లి, సూరప్పకశం, కరకంబాడి వద్ద ఏర్పాటుకు చర్యలు

మహానగరంలో ట్రాఫిక్, డ్రైనేజీ వ్యవస్థలపై దృష్టి

రుయాలో మరో ఎమర్జెన్సీ వార్డు

అఖిలపక్ష సమావేంలో తుడా చైర్మన్‌ చెవిరెడ్డి

సాక్షి, తిరుపతి : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి అభివృద్ధిపై వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుపతి నగరాన్ని విస్తరించడంతో పాటు మంచినీరు, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పొట్టచేతబట్టుకుని వలస వచ్చిన వారందరికీ టౌన్‌షిప్‌లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహకారంతో తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వీసీ గిరీషా రంగంలోకి దిగారు. అందులో భాగంగా తుడా కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

జేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు. వారి నుంచి తిరుపతి, తుడా అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలు, తుడా మాజీ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నగరంలో మంచినీటి సమ స్య పరిష్కారానికి శాశ్వత ప్రణాళికలు రూపొందించనున్నారు. కపిలతీర్థం నుంచి వృథాగా వెళ్లే నీటిని ఒడిసి పట్టాలని నిర్ణయించారు. భూ గర్భ జలాలు మెరుగుపరిచేందుకు ఆక్రమణలకు గురైన చెరువులను అభివృద్ధి చేయనున్నారు. తుడా పరిధిలో విస్తారంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. నగరంలో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మరిన్ని ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

శెట్టిపల్లి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు
శెట్టిపల్లివాసులు కొన్నేళ్లుగా భూ సమస్య పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడున్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అక్రమార్కులు కొందరు ఒకే ప్లాటును ముగ్గురు, నలుగురుకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీంతో సమస్యలు తీవ్రమయ్యాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక తుడా ఆధ్వర్యంలో శెట్టిపల్లివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. దేశంలోనే అత్యాధునికి టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆరు నెలల్లో శెట్టిపల్లివాసుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయం నుంచి పద్మావతి ఫ్లోర్‌మిల్లుకు వెళ్లే మార్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెయ్యనున్నారు. రైల్వేగేటు వద్ద అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జిని నిర్మించాలని, అది పూర్తయితేనే రింగ్‌రోడ్డు సంపూర్ణమవుతుందని తుడా చైర్మన్‌ వెల్లడించారు.

అత్యాధునికమైన టౌన్‌షిప్‌లు
సూరప్పకశం, కరకంబాడి వద్ద ఉన్న తుడా భూముల్లో టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని వసతులతో ఈ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చెయ్యనున్నారు. బస్‌స్టేషన్, కళాశాల, పాఠశాలలు, సినిమా థియేటర్లు, పార్క్‌లు వంటి సకల సౌకర్యాలతో టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. తిరుపతి–శ్రీకాళహస్తి, చంద్రగిరి–తిరుపతి మధ్యలో కూడా టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాజకీయ నాయకులు సూచించారు. అందుకు ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. తిరుపతికి వలస వచ్చిన వేలాది మంది నివాసాలు లేక అద్దె ఇళ్లల్లో ఉన్న విషయాన్ని తుడా చైర్మన్‌ ప్రస్తావించారు. అర్హులైన వారికి సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు నివాస స్థలాలు మంజూరు చేయడం లేదా ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి గృహ సముదాయాన్ని నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నారు.

రుయాలో మరో అత్యవసర విభాగం
రుయాకు రాయలసీమ జిల్లాల నుంచి వేలాది మంది రోగులు, క్షతగాత్రులు వస్తుంటారు. రుయాలో ఒక్కటే అత్యవసర విభాగం ఉండటంతో ఆస్పత్రికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని రుయాలో మరో అత్యవసర విభాగాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. అందుకు తుడా పూర్తి సహకారం అందిస్తుందని చైర్మన్‌ చెవిరెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్, తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదుదారులు చెట్ల కింద వేచి ఉండేపని లేకుండా ప్రత్యేకంగా రిసెప్షన్‌ కేంద్రాలను నిర్మించనున్నారు.

అక్కడ వారికి మంచినీరు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఇలా తుడా పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం, సూచనలు తీసుకునేందుకు తుడా ఆధ్వర్యం లో మూడు నెలలకోసారి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ నాయకుడు, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్, బీజేపీ నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు నవీన్‌కుమార్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు కందారపు మురళి, వందవాసి నాగరాజ, రామానాయుడు, పెంచలయ్య పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top