మూణ్ణాళ్ల ముచ్చట | Totapalli tourism project | Sakshi
Sakshi News home page

మూణ్ణాళ్ల ముచ్చట

Jan 15 2016 12:10 AM | Updated on Sep 3 2017 3:41 PM

తోటపల్లి ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి.

 గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. ఇక్కడ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఆధ్వర్యంలో ప్రాజెక్టు కుడిమట్టికట్ట పరిసరాలలో ఏర్పాటుచేసిన బోటుషికారు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వారి తాకిడి తగ్గింది. ఒకవైపు తాటిపూడి ప్రాజెక్టును పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇటలీకి చెందిన సంస్థ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి తోటపల్లి ప్రాజెక్టు స్థితిగతులపై అవలోకనం చేసుకోవాలి.
 
 కానరాని మౌలిక సౌకర్యాలు
 తోటపల్లిని పర్యాటకులు ఆకర్షించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రూ.41.92లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో రెండు బోట్లను కొనుగోలుచేసి అవసరమైన పనులను నిర్వహించి బోటుషికారును 2012 మార్చిలో అప్పటి కేంద్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి కిశోర్‌దేవ్ అట్టహాసంగా ప్రారంభించారు. బోటుషికారు నిర్వహణకు సుంకి, కోటవానివలస, బంటువానివలస గ్రామాల్లోని పదిమంది గిరిజన యువతకు శిక్షణ కూడా ఇచ్చారు. బోటుషికారు ప్రారంభ తొలినాళ్లలో పర్యాటకుల తాకిడి బాగానే ఉండేది. అయితే ఈ ప్రాంతంలో పర్యాటకులకు అవసరమైన తాగునీరు, విశ్రాంతి గదులు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సందర్శకుల తాకిడి తగ్గింది. ఈ కారణంగా బోటుషికారుకు ఆదాయం రాకపోవడంతోపాటు సిబ్బందికి ఐటీడీఏ సంస్థ సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో నిర్వాహకులు విధులనుంచి తప్పుకున్నారు. ఇప్పుడు బోట్లు అలంకార ప్రాయంగా మారాయి. నిధులు మంజూరుచేసిన అధికారులు కనీస పర్యవేక్షణ చేయకపోవడంతో ఇది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
 
 సౌకర్యాలు కల్పిస్తే మంచిదే...
 ఈ ప్రాంతంలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన వేంకటేశ్వరస్వామి ఆలయంతోపాటు నూతనంగా నిర్మించిన భారీనీటిపారుదల ప్రాజెక్టు ఉండటంతో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. దీనివల్ల అటు ఆలయానికి సందర్శకుల తాకిడి ఎక్కువై ఆదాయం పెరుగుతుంది. ప్రాజెక్టు కుడిమట్టికట్ట ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని గతంలో ప్రాజెక్టును సందర్శించిన సమయంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆ దిశగా పనులుమాత్రం సాగడంలేదు. ముఖ్యంగా కార్తీకమాసంలో ఒడిశా, శ్రీకాకుళం, విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలనుంచి వేలాదిమంది పర్యాటకులు వస్తూంటారు. వారిని ఆకర్షించేలా బోటుషికారు లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులతోపాటు, అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement