తోటపల్లికి ‘కోటి’ కష్టాలు | Totapalli project to 'crore' struggles | Sakshi
Sakshi News home page

తోటపల్లికి ‘కోటి’ కష్టాలు

May 28 2016 1:01 AM | Updated on Sep 4 2017 1:04 AM

తోటపల్లి ప్రాజెక్టును ఆదరాబాదరాగా ప్రారంభించేయాలనే ఆదుర్దాతో చాలా పనులను గుర్తించకుండానే..

విజయనగరం కంటోన్మెంట్: తోటపల్లి ప్రాజెక్టును ఆదరాబాదరాగా ప్రారంభించేయాలనే ఆదుర్దాతో చాలా పనులను గుర్తించకుండానే అధికారులు అగ్రిమెంటు చేసుకున్న విషయం బట్టబయలైంది. ఈ ఏడాది సాగునీరు అందించేందుకు అవసరమయిన పనులు చేస్తుంటే అగ్రిమెంట్లో లేని పలు స్ట్రక్చర్ల నిర్మాణాలు జరగని విషయం బయటపడింది. కోట్ల రూపాయల విలువైన ఆ పనులు అగ్రిమెంట్లో లేనందున తాము చేయబోమని కాంట్రాక్టర్లు ఖరాఖండీగా చెప్పేస్తుంటే.. ఎలాగైనా చేయాల్సిందేనని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనివల్ల తోటపల్లి సాగునీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి.  
 
అడుగడుగునా అవరోధాలు
జిల్లాలోని ఏకైక భారీ సాగు నీటి పారుదల తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రెండు జిల్లాల్లో లక్షా 20వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. తోటపల్లి కుడి ప్రధాన కాలువ 40.700 కిమీల వద్ద బాడంగి మండలం వాడాడ సమీపంలోని గోపాలకృష్ణ రంగరాయపురం(జీకేఆర్ పురం)లో సాగునీటి చెరువుకు వెళ్లాల్సిన వాగునీటికి అడ్డంగా తోటపల్లి కాలువను నిర్మించేశారు. వాస్తవానికి ఆ చెరువుకు నీరు వెళ్లే ప్రాంతలో యూటీ(అండర్ గ్రౌండ్ టన్నెల్)నిర్మించాలి. అంటే తోటపల్లి కాలువ కింది నుంచి చెరువుకు వాలు నీరు వెళ్లాల్సి ఉంది.

ఈ నిర్మాణాన్ని గుర్తించకుండా అగ్రిమెంట్ ఒప్పందం పూర్తయింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో కాలువ నిర్మించేశారు. చెరువుకు వెళ్లే వాగునీటికి ఇది అడ్డంగా ఉండటంవల్ల అక్కడి భూములు మునిగిపోతాయని అధికారులు గుర్తించారు. చెరువుకు నీరూ చేరదు. ఈ రెండు సమస్యలతో పాటు నిల్వ ఉండిపోయే నీటివల్ల కాలువకు భవిష్యత్తులో తోటపల్లి కాలువకు గండి పడే ప్రమాదం కూడా పొంచి ఉంది.

ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కాలువ కిందన యూటీ నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లను కోరుతున్నప్పటికీ వారు ససేమి అంటున్నారు. సుమారు 40 లక్షలకు పైగా వ్యయమయ్యే పనులను తాము అగ్రిమెంట్లో లేకుండా చేపట్టలేమని వారి వాదన. ఇవే కాదు నాలుగైదు పనులు ఇలాంటివి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు.
 
స్టేట్‌లెవెల్ స్టాండింగ్ కమిటీలోనూ...
అధికారులు హుటాహుటిన స్టేట్‌లెవెల్ స్టాండింగ్ కమిటీ అనుమతి కోసం హైద్రాబాద్ వెళ్లారు. అక్కడా వారికి చుక్కెదురైంది. ఒక సారి అగ్రిమెంట్ పూర్తయ్యాక మళ్లీ అందులో కొత్తగా పనులు చేయమనడాన్ని వారు తప్పుపట్టారు. కాకుంటే నీరు-చెట్టు కింద ఆ పనులను చేసుకోవాలనీ, అందుకోసం జిల్లా కలెక్టర్ అనుమతులు ఇవ్వవచ్చనీ సూచించింది. ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు ఆలోచన లేకుండా ఆదరాబాదరాగా పనులు చేయడం వల్ల ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి.అంతేగాకుండా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం కనిపించదని రైతులు చెబుతున్నారు.
 
నీరు-చెట్టు కింద పనులు చేస్తాం
జీకేఆర్ పురంలో కాలువ కింద యూటీ నిర్మిస్తాం. ప్రారంభంలో దానిని గుర్తించలేకపోవడం వల్ల అగ్రిమెంట్‌లో పొందుపరచలేదు. ఇప్పుడు గుర్తించి ఎస్‌ఎల్‌ఎస్‌సీలో చర్చించాం. నీరు-చెట్టు కింద పనులు చేసుకోమన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతులతో ఆ పనులు త్వరగానే చేస్తాం.
- డోల తిరుమల రావు, ఎస్‌ఈ, తోటపల్లి ప్రాజెక్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement