ప్రభుత్వ పథకాల్లో అక్రమాలకు చోటివ్వరాదనే లక్ష్యంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం బాలారిష్టాల నడుమ మంగళవారం నుంచి జిల్లాలో అమలుకానుంది.
కరీంనగర్‌సిటీ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పథకాల్లో అక్రమాలకు చోటివ్వరాదనే లక్ష్యంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం బాలారిష్టాల నడుమ మంగళవారం నుంచి జిల్లాలో అమలుకానుంది. ఏడాదిగా ఊరిస్తున్న ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేయడంలోనూ, ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఇప్పటివరకు జిల్లాలో గ్యాస్ కనెక్షన్లతో బ్యాంక్ లింకేజీ 25 శాతం కూడా పూర్తికాకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం ఆధార్‌తో బ్యాంకు లింకేజీ పొందిన వినియోగదారులకు మాత్రమే నగదు బదిలీ వర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఏమిటీ నగదు బదిలీ..?
గ్యాస్ సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీని ఇప్పటివరకు ప్రభుత్వం నేరుగా భరిస్తూ తక్కువ ధరకు వినియోగదారుడికి అందచేస్తోంది. నగదు బదిలీ పథకం అమలయితే వినియోగదారుడు సిలిండర్‌కు పూర్తి నగదు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. ప్రస్తుతం గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.413 ఉండగా, దీనిపై ప్రభుత్వం రూ.550 సబ్సిడీ రూపంలో భరిస్తోంది. ఇకనుంచి వినియోగదారుడు మొత్తం రూ.963 చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది. సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ మొత్తం రూ.550 ఖాతాలో జమవుతుంది.
లక్ష కనెక్షన్లకే బ్యాంక్ లింకేజీ
జిల్లాలో నగదు బదిలీ పథకం మొదలైనా లింకేజీలు మా త్రం కుదరడం లేదు. జిల్లాలో 64 గ్యాస్‌ఏజెన్సీలుంటే, 7.35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ కనెక్షన్లు ఆధార్, బ్యాంక్ లింకేజీలు అయితేనే నగదు బదిలీ పథకం వర్తిస్తుంది. ఇప్పటివరకు 2.27 లక్షల కనెక్షన్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం కాగా, బ్యాంక్ లింకేజీ 1.07లక్షల కనక్షన్లకే అయ్యింది. ప్రస్తుతం వీరు మాత్రమే నగదు బదిలీకి అర్హులు. జిల్లాలో 2014 జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని, ఈ ఏడాది డిసెంబర్ 31లోగా విని యోగదారులందరూ ఆధార్, బ్యాంక్ లింకేజీ పొందాల్సి ఉంటుంది. అంతవరకు వీరికి సబ్సిడీ సిలిండర్లు అందిస్తా రు. అధికారులు యుద్ధప్రాతిపదికన లింకేజీపై దృష్టిసారిస్తే తప్ప గడువులోగా లింకేజీ పూర్తికావడం అసంభవం.