విశాఖపట్నం అనంతగిరి పరిధిలో పులి సంచరిస్తుందన్న సమాచారంతో విజయనగరం, విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
	అనంతగిరి (విశాఖపట్నం) : విశాఖపట్నం అనంతగిరి పరిధిలో పులి సంచరిస్తుందన్న సమాచారంతో విజయనగరం, విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఆనవాళ్ల సేకరణ కోసం శుక్రవారం అనంతగిరి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. రెండు రోజుల క్రితం పులి పిల్ల రైలు కింద పడి గాయపడిందని, అప్పటి నుంచి పులి ఇక్కడే సంచరిస్తోందని స్థానికులు భయపడుతున్నారు.
	
	రైల్వే గేట్‌మెన్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులకు రెండు రోజుల క్రితం రైలు ప్రమాదంలో ఒక కాలు తెగిపడి మూలుగుతున్న పులిపిల్ల కనపడింది. వెంటనే దాన్ని దగ్గరకు తీసి సపర్యలు చేసి వదిలేశారు. దీంతో దాని తల్లి ఇదే ప్రాంతంలో తిరుగుతోందని.. దాని వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని రైల్వే సిబ్బంది అటవీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం అటవీ అధికారులు రంగంలోకి దిగారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
