ముగ్గురిని మింగిన మద్దిలేరు | Three people died in river | Sakshi
Sakshi News home page

ముగ్గురిని మింగిన మద్దిలేరు

Oct 6 2013 4:41 AM | Updated on Sep 1 2017 11:22 PM

సరదాగా పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు చిన్నారులు మృత్యువు బారిన పడ్డారు. ప్రమాదవశాత్తు వాగులో నీట మునిగి మృతి చెందారు.

గడివేముల, న్యూస్‌లైన్:  సరదాగా పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ముగ్గురు చిన్నారులు మృత్యువు బారిన పడ్డారు. ప్రమాదవశాత్తు వాగులో నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద సంఘటన శనివారం గడివేములలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీవీ మెకానిక్ వెంకటరమణ, నాగమణి దంపతులకు కిరణ్(9), విజయ్ (7)  సంతానం. వివాహమైన పదేళ్లకు ఇద్దరు కుమారులు జన్మించడంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు. వీరిద్దరూ స్థానిక రాజరాజేశ్వరి పాఠశాలలో చదువుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పాఠశాలలకు సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉన్నారు. వారి ఇంటి పక్కనే ఉంటున్న పెద్దస్వామి సోదరి రమాదేవి (13) మానసిక వికలాంగురాలు. ఆమెకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నా, వదిననే పోషిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం పెద్ద స్వామి భార్యాబిడ్డలతో పొలానికి వెళ్లాడు. వారి వెంట రమాదేవి, కిరణ్, విజయ్ సరాదాగా వెళ్లారు.
 
 ప్రమాదం ఇలా జరిగింది: మధ్యాహ్నం భోజనం చేసేందుకు అందరూ ఇంటికి బయలుదేరారు. పిల్లలు పరిగెత్తుకుంటూ ముందు వచ్చారు. మార్గమధ్యంలో మద్దిలేరు వాగు దాటే ప్రయత్నంలో విజయ్ అదుపు తప్పి గతంలో మట్టి కోసం తవ్విన గుంతలో పడిపోయాడు. నీట మునుగుతున్న తమ్ముడిని కాపాడేందుకు కిరణ్ దూకాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీట మునిగిపోయారు. వాగు ఒడ్డున ఉన్న రమాదేవి వారిని రక్షించేందుకు నీటిలోకి దిగింది. ఈత రాకపోవడంతో బాలిక కూడా నీట మునిగింది. అక్కడే ఉన్న పెద్దస్వామి కుమార్తె వెనుకకు పరిగెత్తి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది.
 
 వారు రోదిస్తూ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో నీటిలో గాలించారు. సమీపంలోని గుంతలో ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెంకటరమణ వాగు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. వాగు దాటే ప్రదేశానికి సమీపంలో మట్టి కోసం గుంతలు తవ్వడంతో ప్రమాదానికి కారణమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి గ్రామానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
 
 గౌరు పరామర్శ: ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి గడివేముల చేరుకుని మృతి చెందిన చిన్నారుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కాతా రాజేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ వై.శివరామిరెడ్డి, డి.సత్యనారాయణరెడ్డి, తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement