జగన్ నిరశనకు సంఘీభావం: కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేల గుడ్‌బై

జగన్ నిరశనకు సంఘీభావం: కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేల గుడ్‌బై - Sakshi

కాంగ్రెస్‌కు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమ నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి, తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనకు మద్దతుగా, అందరికీ న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముగ్గురు ఎమ్మెల్యేలూ సంఘీభావం ప్రకటించారు. జైలులో ఉన్న మాజీ మంత్రి, గుంటూరు జిల్లా రేపల్లె శాసనసభ్యుడు మోపిదేవి వెంకటరమణతన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, దాన్ని స్పీకర్ కార్యాలయానికి పంపించినట్టు జైలు అధికారులు ధ్రువీకరించారు. గతంలోనే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీలో చేరారు. కర్నూలు జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా తన శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు జగన్ దీక్షకు మద్దతుగా తాను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

 

అండగా నిలవడం జగన్ నైజం: కేతిరెడ్డి

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోమవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని తన అభీష్టాన్ని వెల్లడించారు. విజయమ్మ ఆయనకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా సమైక్యంగా కలిసి ఉండాలని కోరుతూ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తూండటాన్ని సమర్థిస్తున్నట్టు చెప్పారు. ఆయన దీక్షకు మద్దతుగానే తాను వైఎస్సార్‌సీపీలో చేరానని చెప్పారు. ‘‘ఈ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. అందులో వైఎస్సార్‌సీపీ అగ్రభాగాన ఉంది. ఈ ఒక్క ఉద్యమమే కాదు, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నా వారికి అండగా నిలవడం జగన్ నైజమని అనేకసార్లు రుజువైంది. రాష్ట్రంలో అనేక పార్టీలు ద్వంద్వ నీతి ప్రదర్శిస్తుంటే జగన్ మాత్రం తెలుగు జాతి విచ్ఛిన్నం కాకూడదనే విధానంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఈ ఉదయం రాజీనామా చేసి, ఆ తర్వాతే ఇక్కడకు వచ్చాను’’ అన్నారు. విభజన దిశగా సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన వెంటనే తన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు ఆయన గుర్తు చేశారు.

 

విజయమ్మను అవమానించారు: మోపిదేవి

మాజీ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణ తన శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన స్పీకర్ ఫార్మేట్‌లో తన రాజీనామా లేఖను జైలు సూపరింటెండెంట్‌కు అందజేశారు. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ తీసుకున్న అడ్డగోలు నిర్ణయానికి నిరసనగానే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు సమ న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వైఎస్ విజయమ్మ, జగన్‌ల దీక్షలకు సంపూర్ణంగా మద్దతిస్తున్నట్టు తెలిపారు. మోపిదేవి కుమారుడు రాజీవ్ తన తండ్రిని కలిసేందుకు సోమవారం జైలు ములాఖత్‌కు వెళ్లారు. ఆ సమయంలో తన రాజీనామా విషయాన్ని రాజీవ్‌తో చెప్పిన మోపిదేవి.. వాటి వివరాలను నియోజకవర్గ నేతలకు, తన సోదరుడు హరనాథ్‌కు అందజేసే ఏర్పాటు చేశారు. ఈ మేరకు మోపిదేవి రాజీనామా వివరాలను హరనాథ్ సోమవారం సాయంత్రం రేపల్లెలో విలేకరులకు వెల్లడించారు. ‘‘జైల్లో ఉండి కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగన్ చేస్తున్న దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు మోపిదేవి రాజీనామా చేశారు. సమ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ విజయమ్మ గుంటూరులో ఆరు రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసులు ఆమెను అనేక అవమానాలకు గురి చేయడాన్ని జీర్ణించుకోలేని అంశంగా మోపిదేవి భావించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిని ఆంబులెన్సులో కాకుండా నేరస్తురాలి మాదిరిగా పోలీస్ జీపులో ఆస్పత్రికి తరలించడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నిందని, పార్టీల నేతలంతా ఉద్యమాల ద్వారా కలిసికట్టుగా పని చేసి దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు’’ అని హరనాథ్ వివరించారు.

 

జగన్‌కు మద్దతుగా కాటసాని దీక్ష

విభజన నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కాటసాని రామిరెడ్డి తెలిపారు. సమ న్యాయం కోసం జగన్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించడమే గాక తాన కూడా ఆమరణ దీక్షకు దిగారు. జూలై 31వ తేదీనే శాసనసభ్యత్వానికి రామిరెడ్డి రాజీనామా చేయడం తెలిసిందే. సోమవారం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నిరాహార దీక్షను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ మాత్రమే సమర్థంగా పోరాడుతోందన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఇరు ప్రాంత ప్రజల్లోనూ చులకనయ్యారు. కాంగ్రెస్ నేతలు పదవులను పట్టుకు వేలాడుతూ ఉద్యమంలో పాల్గొనలేకపోతున్నారు. మున్ముందు ఏ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీల నేతలకు డిపాజిట్లు కూడా దక్కవు. ప్రజల కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానిని చేసేందుకు కావాల్సిన ఓట్లు, సీట్ల కోసం దేశాన్ని పాకిస్తాన్‌కు తాకట్టు పెట్టేందుకు కూడా వెనకాడరు. ఉద్యమం ఇంత ఉద్ధృతమైనా ఢిల్లీ, హైదరాబాద్‌లకే పరిమితమైన కాంగ్రెస్ నేతలను ప్రజలు క్షమించరు. నాకు పదవులు ముఖ్యం కాదు. సమ న్యాయం కోసం వైఎస్సార్‌సీపీ నిర్ణయాలకు కట్టుబడి ముందుకు సాగుతాను’’ అని ప్రకటించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top