‘గురుకులం’పై గద్దలు!


ఘట్‌కేసర్, న్యూస్‌లైన్:  నిరుపేదలకు ఉచితంగా విద్యనందించాలనే సదుద్దేశంతో ఘట్‌కేసర్‌లో నిర్మించిన గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల మనుగడకు ముప్పు వాటిల్లింది. దశాబ్ధాల క్రితం దాతలు అందజేసిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రముఖ విద్యాసంస్థగా పేరుగాంచిన ఇక్కడి విద్యాసంస్థ నేడు దయనీయ స్థితికి చేరింది.  ప్రముఖ ఆర్యసమాజ నాయకుడు, సంఘ సేవకుడు బన్సీలాల్ వ్యాస్‌జీ 1938 సంవత్సరంలో నగరంలోని రాంబాగ్‌లో నిరుపేదలకు తెలుగు, సంస్కృతం మాధ్యమంలో విద్యను అంద జేయాలని పాఠశాలను ప్రారంభించారు. అనంతరం కొన్ని కారణాల వల్ల 1942లో ఆ పాఠశాలను ఘట్‌కేసర్‌కు తరలించారు. ఇక్కడ సుమారు 24ఎకరాల స్థలంలో గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలను ఏర్పాటు చేశారు. తన అల్లుడు చేస్తున్న సమాజసేవకు ముగ్దుడైన బన్సీలాల్ వ్యాస్‌జీ మామ వైద్యనాథ్.. శేరిలింగంపల్లి సమీపంలోని మాదారం, వెంకటాపూర్‌లో ఉన్న 627ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. దానిని వ్యాస్‌జీ తన పేరుమీద కాకుండా గురుకులం పేరు మీదకు మార్చారు. దాని ద్వారా లభించే ఆదాయాన్ని పూర్తిగా గురుకులాల నిర్వహణకే ఖర్చుచేశారు. వ్యాస్‌జీ చేస్తున్న కృషిని చూసిన పలువురు ప్రముఖులు సైతం విరాళాలు అందజేశారు. అయితే నిర్వహణ సరిగా లేక ఆదాయం క్షీణించి గురుకులాల మనుగడ కష్టంగా మారినట్టు తెలుస్తోంది.

 

 ఘట్‌కేసర్ స్థలంలో అనేక నిర్మాణాలు

 ఘట్‌కేసర్‌లో కేటాయించిన స్థలంలో కొన్ని కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించారు. నిరుపేద, సామాజికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం వసతి గృహాన్ని సైతం ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించారు. యజ్ఞయాగాలు నిర్వహించటానికి పెద్దయజ్ఞశాలను నిర్మించారు. పిల్లలకు ధ్యానంపై శిక్షణ ఇప్పించటానికి ధ్యాన మందిరం నిర్మించారు.

 

 కబ్జాదారుల కన్ను..

 గురుకులం భుములపై ఇప్పుడు కబ్జాదారుల కన్ను పడింది. సుమారు ఐదెకరాలు ఇప్పుడు అన్యాక్రాంతమైంది. దీని విలువ రూ.ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా. ట్రస్టు నుంచి ప్రశ్నించేవారు లేకపోవడం, నిర్వహణను గాలికొదలడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇటీవల ఒకటిన్నర ఎరకం కబ్జాకు గురికావడంతో స్థానికులు స్పందించి అడ్డుకున్నారు. మిగిలిన భూమికూడా అక్రమార్కుల పరం కాకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా బన్సీలాల్ వ్యాస్‌జీ 1956లో జడ్చర్ల వద్ద జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయారు. ఆయన స్మృతి చిహ్నంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 2న గురుకులంలో 24గంటలు అఖండ గాయత్రీ మంత్రం పఠించి అన్నదానం చేస్తారు. బన్సీలాల్ వ్యాస్‌జీ చనిపోయిన కొన్నాళ్లకు గురుకుల విద్యాసంస్థ నిర్వహణ ట్రస్టు మారింది. దానికి చైర్మన్‌గా కొంతకాలం వందేమాతరం రామచంద్రరావు కొనసాగారు. ట్రస్టు సభ్యుల మ ద్య విభేదాలు తలెత్తడంతో ఆలనాపాలన చూ సుకునేవారు లేకపోయారు. ఆ తర్వాత మారి న ట్రస్టు సభ్యులు గురుకుల అభివృద్ధిని విస్మరించారు. ప్రస్తుతం గురుకుల భూములు కబ్జా కు గురవుతున్నా సంస్థ తరఫున ప్రశ్నించేవా రు లేరు. ఇటీవల ఓ వ్యాపారవేత్త ఒకటిన్నర ఎకరం భూమి చుట్టూ కడీలు పాతి కబ్జాకు పాల్పడగా దానిని స్థానికులు అడ్డుకున్నారు.  

 

 దయనీయం.. నేటి పరిస్థితి

 దేవాదాయశాఖసహకారంతో ప్రస్తుతం గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయుల నియామకాలు లేవు. దాంతో తక్కువ మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ టీచర్ల సహాయంతో విద్యా సంవత్సరాన్ని నెట్టుకొస్తున్నారు. ఉపాధ్యాయులు తక్కువ గా ఉండటంతో విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతోంది. కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకోగా మిగిలిన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. దాతలు, పూర్వ విద్యార్థులు కొన్ని తరగతి గదులను నిర్మించారు.

 

 కబ్జాదారులపై కేసులు పెడతాం: ఎమ్మెల్యే

 గురుకుల స్థలాలను కబ్జాచేస్తే కేసులు పెడతామని స్థానిక ఎమ్మెల్యే కేఎల్లార్ ఇటీవల జరిగిన వ్యాస్‌జీ వర్ధంతి సభలో హెచ్చరించారు. కబ్జా చేసినవారితోపాటు అందుకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. కబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top