ఉందిలే మంచికాలం ముందుముందునా..

There Will Be Good Days - Sakshi

సాక్షి, ఏలూరు (మెట్రో): పంచాంగ శ్రవణంలో జిల్లాలో అనుకూలమైన అంశాలున్నాయని పండితులు తెలిపారు. రైతులకు సాగునీటికి కొరత ఉండదని, వారి పరిస్థితి కూడా బాగుంటుందని చెప్పారు. శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని గోదావరి సమావేశ మందిరంలో జ్యోతిని వెలిగించి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు. పండితులు తాడికొండ నరసింహరావు, కాశిభొట్ల ప్రసాద్‌ సంయుక్తంగా పంచాంగ శ్రవణం చేశారు. జిల్లాకు బాగుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కన్నా పశ్చిమ గోదావరి జిల్లా అగ్రభాగాన ఉండేందుకు అవసరమైన సహజ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధిలో జిల్లాను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధం కావాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు నూరుశాతం చేరినప్పుడే అభివృద్ధి కల సాకారమవుతుందన్నారు.

మనం చేసే పని సానుకూల దృక్పథంతో చేస్తే సత్ఫలితాలు సాధించగలమన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. వేద పండితులు యనమండ్ర రవిప్రకాష్‌ శర్మ, పిరాట్ల ఆదిత్య శఱ్మ, కూచిబొట్ల సచ్చితానంద ప్రసాద్‌ వేదపఠనం చేసి, వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం గండికోట రాజేష్‌ శిష్యబృందం ప్రదర్శించిన ఉగాది స్వాగత నృత్యం, జిల్లా ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నృత్యం సభికులను ఆకట్టుకుంది. అనంతరం వేద పఠనం, పంచాంగ శ్రవణకర్తలను కలెక్టర్‌ సత్కరించారు. కలెక్టర్‌కు జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top