మండలంలోని బబ్బెళ్లపాడు గ్రామంలోని పురాతన చెన్నకేశవ, రామలింగేశ్వరస్వామి ఆలయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.
బబ్బెళ్లపాడు (చందర్లపాడు రూరల్), న్యూస్‌లైన్: మండలంలోని బబ్బెళ్లపాడు గ్రామంలోని పురాతన చెన్నకేశవ, రామలింగేశ్వరస్వామి ఆలయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఆలయాల పరిరక్షణ చేయాల్సిన దేవాదాయ శాఖ నిధుల లేమి సాకుతో కేవలం పర్యవేక్షణకే పరిమితం కావడంతో సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో దాతల విరాళాలతోనే ఆలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి.
ఒకే ప్రాకారంలో మూడు ఆలయాలు...
గ్రామంలోని ప్రధాన రహదారిని అనుకుని ఒకే ప్రాకారంలో మూడు ఆలయాలు ఉండటం ఇక్కడి విశిష్టత. రామలింగేశ్వర ఆలయం (శివాలయం), చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు ఆంజనేయునికి ఇక్కడ గుడులు నిర్మిం చారు. ముక్త్యాల జమీందారుల పాలన లో ఉన్న సమయంలోనే ఈ ఆలయాలను దాదాపు మూడొందల ఏళ్ల క్రితం నిర్మించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ ఆజమాయిషీలోకి వస్తే ఆలయాల అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 1965లో అప్పటి గ్రామ సర్పంచి బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయి న్యాయ పోరాటం చేయడంతో ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు.
పదేళ్ల పాటు నైవేద్యం కరువు...
దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలయం లో దాదాపు పదేళ్లకు పైగా నిత్య ధూప దీప నైవేద్యాలతో పాటు పూజారులకు భత్యాలు, నిర్వహణ పూర్తిగా లేకుండా పోయాయి. దీంతో గ్రామస్తులు కలసి ఆలయాలకు ఉన్న 41 ఎకరాలను దేవాదాయ శాఖతో సంబంధం లేకుండా కౌలు వేలం నిర్వహించి ఆలయ నిర్వహణ చేపట్టారు.కౌలు వేలం ద్వారా నిల్వ చేసిన రూ. 7 లక్షలతో పాటు మరిన్ని నిధులు మంజూరు చేసి ఆలయాలను పునర్నిర్మాణం చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు.
నిధులు లేవన్న దేవాదాయ శాఖ...
ఆలయాల పునర్నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయలేమని, కామన్ గుడ్ ఫండ్ ఆలయానికి మంజూరయ్యే అవకాశం లేదని దేవాదాయ శాఖాధికారులు ఖరాఖండిగా తేల్చారు.
అయితే విషయాన్ని అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ రమణాచారి దృష్టికి తీసుకువెళ్లి డోనర్స్ స్కీం ద్వారా ఆలయాన్ని పునర్నిర్మించుకునేలా గ్రామస్తులు అనుమతి సాధించుకున్నారు.
రూ. 30 లక్షల పనులు...
చెన్నకేశవ, రామలింగేశ్వర, ఆంజనేయస్వామి ఆలయాల పునరుద్ధరణతో పాటు ఆలయ ఆవరణంలో నవగ్రహా మండపం నిర్మించడం, ప్రతిష్టోత్సవాలను నిర్వహించడం వంటి కార్యక్రమాల కోసం రూ. 50 లక్షల దాకా ఖర్చవుతుందని అంచనా వేసి, కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. గ్రామంలో కొద్ది మొత్తంలో నిధులు సమకూరినప్పటికీ, పలు సంస్థలు, ప్రముఖుల నుంచి దాదాపు రూ. 25 లక్షల మేర నిధులు సమీకరించినట్లు పునర్నిర్మాణ కమిటీ కన్వీనర్ బబ్బెళ్లపాటి సాయి తెలిపారు.
ముడి ఆలయాల నిర్మాణం జరిగిందని, గోపురాల నిర్మాణం, ప్లాస్టరింగ్, ప్రహారీ నిర్మాణం, శిల్పాల పనుల కోసం మరో రూ. 20 లక్షల మేర నిధుల అవశ్యకత ఉందన్నారు. ఆలయానికి తుది రూపు ఇచ్చేందుకు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.