రావణ వ్యూహం! | The move to the head of Lanka, a TDP leader | Sakshi
Sakshi News home page

రావణ వ్యూహం!

Jan 12 2016 1:48 AM | Updated on Aug 10 2018 8:16 PM

తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామంలోని సొసైటీలకు చెందిన లంక భూములను గంపగుత్తగా కొట్టేసేందుకు ...

లంకకు అధిపతి కావాలని  ఓ టీడీపీ నేత ఎత్తుగడ
కారు చౌకగా దళితుల భూములు కొనేందుకు కుట్ర
తన అనుయాయులతో రాయపూడిలో విష ప్రచారం
భయాందోళనకు గురై  600 ఎకరాలను గంపగుత్తగా
విక్రయించాలని నిర్ణయించుకున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు

 
గుంటూరు : తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామంలోని సొసైటీలకు చెందిన లంక భూములను గంపగుత్తగా కొట్టేసేందుకు జిల్లాలోని ఓ టీడీపీ నేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ గ్రామంలోని ఎస్సీ, ఎస్టీల పేదరికం, అవిద్య, అమాయకత్వాలను ఆసరాగా మొత్తం 600 ఎకరాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు పెద్ద వ్యూహాన్నే రచించారు.
 
తెరపైకి విష ప్రచారం ...

ముందుగా ఆ సొసైటీల్లోని నలుగురైదుగురిని ఎంపిక చేసుకుని వారి ద్వారా లంక భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని, ఎలాంటి నష్టపరిహారం  ఇవ్వదని, త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని, అందుకే  సర్వే చేస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. కొద్ది రోజుల తరువాత ఆ సొసైటీల్లోని మరో ఇద్దరు ముగ్గురు కొత్త వ్యక్తులు ఈ లంక భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందని, ఈలోపు ఎవరికైనా టీడీపీ నేతలకు అమ్ముకుంటే, మంచి ధర వస్తుందని, గుట్టుగా వ్యవహారం ముగిసిపోతుందనీ ప్రచారం చేశారు. దీంతో పేద ఎస్సీ, ఎస్టీల్లోని మహిళలు, అప్పులు ఉన్న వారు, ఆడపిల్లల వివాహ బాధ్యత కలిగిన వారు కలవరం చెందారు.
 
తలా పదివేలు పంపిణీ...
 మళ్లీ కొద్ది రోజులకు విష ప్రచారం రేపిన వ్యక్తులు అక్కడి పరిస్థితులు తమకు సానుకూలంగా కనిపించడంతో లంక భూములు గంపగుత్తగా అమ్మేద్దామని మిగిలిన సభ్యులను ప్రోత్సహించారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత ఆ టీడీపీ నేత మరో కొత్త వ్యక్తిని గ్రామంలోకి రంగ ప్రవేశం చేయించి లంక భూములన్నింటినీ కొనుగోలు చేయడానికి ఒక నేత ముందుకు వచ్చారని చెప్పించారు.  ఇందుకు అనుగుణంగా ఆ వ్యక్తి సొసైటీలకు చెందిన కొందరు వ్యక్తులను ఎంపిక చేసుకుని తలో పదివేల రూపాయలను ఖర్చుల కింద ఇచ్చారు. ఈ నగదు తీసుకున్న వ్యక్తులు టీడీపీ నేతకు లాభం వచ్చే విధంగా ఎకరా రేటు నిర్ణయించారు. లంక భూములను అమ్ముకునే, కొనుక్కునే అధికారం లేదనీ,  అయితే ఆ నేత అసైన్డ్ భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు వీటిని కూడా చేయించుకుంటారని,  అలా చేసుకోవాలంటే వారికీ చాలా ఖర్చు అవుతుందని, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందికి పెద్ద మొత్తంలోనే మామూళ్లు ఇవ్వాలని అందుకు ఎకరా రూ.5 లక్షలకు మించి కొనడానికి ముందుకు రావడం లేదని చెప్పారు.
 
గ్రామంలో రెండు రోజుల నుంచి ఈ రేటుపై తర్జన భర్జన జరుగుతోంది. కనీసం రూ.10 లక్షలైనా ఇస్తే, తమకు న్యాయం జరిగినట్టు ఉంటుందని ఎస్సీలు ఆ వచ్చిన నేత, సొసైటీల్లోని ఇతర సభ్యుల ద్వారా రాయబారం నడిపారు. అయితే ఆ నేత ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఇలా అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేయించిన టీడీపీ నేత సొసైటీల చేతుల్లోని లంక భూములను కొట్టేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
 
రాయపూడి లంక భూముల వివరాలు ....

కృష్ణానదిలోని రాయపూడిలంకకు సంబంధించి మొత్తం 600 ఎకరాలను దళితులు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డీకే పట్టాలతో కొందరు, బీ ఫారాలతో కొందరు అర్హులుగా ఉన్నారు. ఇందులో సొసైటీల కింద 500 ఎకరాలను సాగుచేస్తుండగా, మిగిలిన భూములను లెనిన్ సొసైటీ, అంబేద్కర్ సొసైటీ, హరిజన ఫార్మింగ్ సొసైటీ పేరుతో మనుగడ సాగిస్తున్నారు. 1954 నుంచి దళితరైతుకు ఒక్కొక్కరికీ 90 సెంట్లు చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో కృష్ణాకెనాల్ డివిజన్ లీజు కిందకూడా సాగు చేశారు. దీనికి సంబంధించి పలుమార్లు రివర్ కన్జర్వేటర్స్ ద్వారా అనుమతుల కోసం మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ప్రయత్నించారు. అలా జరిగి ఉంటే పూర్తి హక్కులు వచ్చేవి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement