జిల్లావ్యాప్తంగా సొంతిల్లు కల సాకారం చేసుకునేందుకు 3లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా సొంతిల్లు కల సాకారం చేసుకునేందుకు 3లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కేవలం రచ్చబండ కార్యక్రమాల్లోనే 2.19 లక్షల మంది అర్జీలు సమర్పించగా, వివిధ రూపాల్లో మరో 80వేల దరఖాస్తులు అధికారుల దరిచేరాయి. అయితే, ప్రభుత్వం పట్టణ గృహనిర్మాణ పథకాలను విస్మరించడంతో బడుగుల గూడు కల నెరవేరడం లేదు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) కూడా గృహనిర్మాణ పథకాలపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో యూపీహెచ్ పథ కం అటకెక్కింది.
మరోవైపు వివిధ రూపాల్లో వచ్చిన 18,398 అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించిన జీహెచ్‌ఎంసీ, జిల్లా యంత్రాంగం లబ్ధిదారుల స్థితిగతులపై సామాజిక ఆర్థిక సర్వే కూడా నిర్వహించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ల సిఫార్సులతో 1,284, సీఎంవో నుంచి 1,150, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు సూచించిన 8,362 అర్జీలు సహా కుల సంఘాలు ఇచ్చిన 19,881 దరఖాస్తులు అధికారులకు చేరాయి. శివారు ప్రాంతాల్లో స్థలాల కొరత ఉండడం, ఉన్న కొద్ధిపాటి స్థలాల ధరలు ఆకాశన్నంటడంతో ప్రభుత్వం పట్టణ హౌసింగ్‌ను పక్కనపెట్టింది. స్థలాలను ఎంపిక చేసినప్పటికీ, మౌళిక సదుపాయాల కల్పనకు నిధుల సమస్య ఉత్పన్నమవుతుండడంతో జీహెచ్‌ఎంసీ గృహ నిర్మాణ పథకాలకు రాం రాం పలికింది. ఈ నేపథ్యంలోనే గతంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఇప్పటివరకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఆఖరికి వాటర్ బోర్డు కూడా మంచినీళ్లు సరఫరా చేయడం లేదు.
ఈ తరుణంలో పట్టణ పక్కా గృహనిర్మాణ పథకం నిలిచిపోయిందని చెప్పవచ్చు. దానికితోడు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం స్థానే ప్రవేశపెట్టిన రాజీవ్ ఆవాస్‌యోజన(రే) పథకం ఆచరణ యోగ్యం లేకపోవడంతో పట్టణ గృహ నిర్మాణాలకు గ్రేటర్ అంతగా ఆసక్తి చూపడంలేదు. దీంతో వైఎస్సార్ మరణానంతరం జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా ఒక ఇల్లు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేకపోయింది. అడపాదడపా ఏడాది 2వేల చొప్పున గ్రామీణ నియోజకవర్గాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నప్పటికీ, పట్టణ ప్రాంతాలను మాత్రం పూర్తిగా విస్మరించింది. మరోవైపు ఏయేటికాయేడు రాజధాని నగరానికి వలసల తాకిడి పెరగడంతో శివారు ప్రాంతాల్లో ఇళ్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది.
స్థలాలను గుర్తిస్తున్నాం: కలెక్టర్ శ్రీధర్
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. గృహానిర్మాణ సముదాయాలకు అవసరమైన స్థలాలను గుర్తించమని ఆర్డీవోలకు ఆదేశాలిచ్చా. స్థలాలను ఎంపిక చేసిన అనంతరం నిధుల సర్దుబాటుకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను చేపడతాం. ఖాళీగా ఉన్న 9వేల మంది ఇళ్లను అర్హులైనవారికీ కేటాయించడమేకుండా, స్థానికులకు కూడా కొంత మేర అవకాశం కల్పించాలని నిర్ణయించాం.