బాలికకు విముక్తి


 టంగుటూరు, న్యూస్‌లైన్ : ఓ మహిళ వద్ద బంధీగా ఉన్న 13 సంవత్సరాల బాలికకు చైల్డ్‌లైన్ (1098) చొరవతో విముక్తి లభించింది. గురువారం టంగుటూరులో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా రూరల్ మండలం ఎర్తెని గ్రామంలో నివాసం ఉండే నిరుపేద అయిన నరసింహులుకు ఏడుగురు సంతానం. నాలుగేళ్ల క్రితం భార్య మరణించడంతో అతనే పిల్లలను చూసుకుంటున్నాడు. వారిలో చివరి కుమార్తె అయిన 13 ఏళ్ల భాగ్యంకు మినహా మిగిలిన వారందరికీ వివాహాలయ్యాయి.

 

 ఈ నేపథ్యంలో కూలి పనుల నిమిత్తం జిల్లాలోని టంగుటూరు నుంచి మహబూబ్‌నగర్ వలస వెళ్లిన పద్మ అనే మహిళ.. వారం రోజుల క్రితం ఇంటి ముందు ఏడుస్తూ కనిపించిన భాగ్యంను చూసి దగ్గరకు తీసుకుని ఓదార్చింది. తనతో వస్తే బాగా చూసుకుంటానని మాయచేసింది. కొత్త డ్రస్సు కొనిపిస్తానంటూ వెంటబెట్టుకుని హైదరాబాద్ తీసుకెళ్లింది. అక్కడ ఉంటున్న తనకు తెలిసిన వారింట్లో రెండు రోజులు ఉండి అనంతరం బాలికను తీసుకుని టంగుటూరులోని తన ఇంటికి చేరింది. స్థానిక పోతుల చెంచయ్య వెస్ట్‌కాలనీలోని ఒక చిన్న రేకుల గదిలో బాలికను బంధించింది. అయితే, టంగుటూరు వచ్చిన తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది. స్థానిక వీధుల్లో యాచించి డబ్బు తీసుకురావాలంటూ బాలికను హింసించడం ప్రారంభించింది. మద్యం సేవించాలని చిత్రహింసలకు గురిచేసింది.

 

పద్మ చేష్టలకు బెంబేలెత్తిన బాలిక బుధవారం అక్కడి నుంచి తప్పించుకుని ఏడుస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం రోడ్డులో వెళ్తుండగా.. ఆ రోడ్డులో హోటల్ నిర్వహించే ఓ మహిళ గమనించి దగ్గరకు తీసింది. వివరాలు తెలుసుకుని ఇంటికి తీసుకెళ్లింది. ఆమె ద్వారా బాలిక విషయం తెలుసుకున్న స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త వెంటనే ఒంగోలులోని చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి సాగర్‌కు సమాచారం అందించింది. టంగుటూరు పోలీసుల సాయంతో గురువారం రంగంలోకి దిగిన  చైల్డ్‌లైన్ ప్రతినిధి.. హోటల్ నిర్వాహకురాలి వద్ద ఆశ్రయం పొందుతున్న బాలికను తీసుకెళ్లి చైల్డ్‌లైన్ వెల్‌ఫేర్ కమిటీ చైర్మన్ ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు.

 

 ఆయన ఆదేశాల మేరకు నాగులుప్పలపాడు మండలం మాచవరంలోని ఆశాసదన్ హోంకు బాలికను తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మ పరారవడంతో ఆమె కోసం స్థానికులు గాలిస్తున్నారు. అయితే, దీనిపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని స్థానిక ఎస్సై తిరువీధుల త్యాగరాజు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top