సకల జనం సమైక్యరాగం అందుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. వినూత్న నిరసనలతో హోరెత్తిస్తున్నారు. గత 39 రోజులుగా సడలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
సాక్షి, కర్నూలు : సకల జనం సమైక్యరాగం అందుకున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. వినూత్న నిరసనలతో హోరెత్తిస్తున్నారు. గత 39 రోజులుగా సడలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, మండల కేంద్రాల్లోని ముఖ్య సర్కిళ్లు ఉద్యమకారులతో పోటెత్తుతున్నాయి. శనివారం సైతం జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర పరిరక్షకు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కల్లూరు మండలానికి చెందిన పొదుపు లక్ష్మీగ్రూపు మహిళలు పెద్దటేకూరు గ్రామం వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు.
అక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కర్నూలులో వాసవీ మహిళా కళాశాల విద్యార్థులు తెలుగుతల్లి విగ్రహం వద్ద మానహారం నిర్వహించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. హైకోర్టు వద్ద సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణా లాయర్లు చేసిన దాడికి నిరసనగా జూనియర్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో బైక్ ర్యాలీ చేశారు.
సి.క్యాంపు సెంటర్ నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు కొనసాగించి అక్కడ అధ్యాపకులు మానవహాహరం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి సంఘీభావంగా ప్రాంతీయ కంటి ఆసుపత్రి స్టాఫ్‌నర్సులు, పారామెడికల్ సిబ్బంది ర్యాలీ జరిపారు. ఆదోనిలో జడివానలోనూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, కుల సంఘాల జేఏసీల ఆద్వర్యంలో నిరసన ప్రదర్శనలు, సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఆళ్లగడ్డ పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో సిబ్బంది, విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు.
ఆలూరులో జేఏసీ నాయకులు, సాక్ష్భ్రారత్ వలంటీర్ల ఆధ్వర్యంలో రిలేనిరహార దీక్షలు ప్రారంభించారు. బనగానపల్లెలో సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా సమైక్యవాదులు మహామానవహారం ఏర్పడ్డారు. ఇక్కడ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. కొలిమిగుండ్ల మండలంలో పాలీష్ ప్యాక్టరి యాజమానుల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. డోన్ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 38వరోజుకు చేరాయి. శనివారం సమైక్యాంధ్ర కోరుతూ దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఒంటెలతో ప్రదర్శన చేశారు. అనంతరం జాతీయరహదారిపై వంటావార్పు చేశారు. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రిలే నిరాహారదీక్షలను కొనసాగించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమతి ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయీ బ్రాహ్మణ, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ సంఘాలు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.
శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా 48గంటల దీక్షను చేపట్టారు. కోసిగిలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సెల్‌ఫోన్ షాపుల యజమానులు దుకాణాలు మూసివేసి స్థానిక మార్కండేయ ఆలయ ప్రాంగణం నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. చాగలమర్రిలో ఆర్యవైశ్యులు పొట్టి శ్రీరాములు చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరులో సకల జనుల సింహగర్జన విజయవంతమైంది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. పాటలు పాడి కళాకారులు ఉద్యమస్ఫూర్తిని రగలించారు.