
ఇక ఆందోళనలు ఉధృతం
చిలకలూరిపేట: మూడేళ్లుగా శనగరైతులు గిట్టుబాటు ధరలేక నష్టాలబాట పట్టారు. మార్కెట్‌లో శనగలు కొనేవారులేక ప్రభుత్వపరమైన ప్రోత్సాహం కరువవడంతో ఇబ్బందులు పడ్డారు.
చిలకలూరిపేట: మూడేళ్లుగా శనగరైతులు గిట్టుబాటు ధరలేక నష్టాలబాట పట్టారు. మార్కెట్‌లో శనగలు కొనేవారులేక ప్రభుత్వపరమైన ప్రోత్సాహం కరువవడంతో ఇబ్బందులు పడ్డారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 17 లక్షల క్వింటాళ్ల శనగ శీతల గిడ్డంగుల్లో మగ్గుతోంది. ఎన్నికలకు ముందు ఒంగోలులో జరిగిన సభలో అప్పటి ప్రతిపక్షనేత, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును కలసిన శనగ రైతులకు అధికారంలో రాగానే గిట్టుబాటు ధర అందజేస్తామని హామీఇచ్చారు. అధికారంలోకి వచ్చి వంద రోజులైనా శనగరైతు హామీపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేకపోయారు. గత నెల 27న ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు విన్నవించారు. వారంలో సమస్య పరిష్కారమవుతుందని ఆశించిన రైతులకు నిరాశేమిగిలింది. దీంతో శనగ రైతు సంఘం పేరుతో రైతులు ఆందోళన బాట పట్టారు. శనగ నిల్వలపై బ్యాంకు రుణాలు పొందిన రైతులకు.. రుణాలు చెల్లించకపోతే శనగ నిల్వలను ఈ నెల 25 నుంచి 29వరకు వేలం వేస్తామని ప్రకటిం చాయి. దీంతో ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాసాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న పలువురు రైతు నాయకులు సమస్యలపై మాట్లాడారు.
పాలకుల విధానాలతో ఇబ్బందులు..
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో శనగ రైతుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. విదేశాల నుంచి అనేక ఆహారధాన్యాలను దిగుమతి చేసుకోవడం వల్ల రైతులు పండించే పంటకు డిమాండ్ లేకుండాపోయింది.
- బొల్లు శంకరరావు, కౌలు రైతు సంఘం జిల్లానేత
ప్రత్తిపాటి తప్పించుకునే యత్నం..
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నుంచి స్పష్టమైన హామీరాలేదు. మరో 15 రోజులంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకులు నిర్వహించే వేలంపాటలను అడ్డుకుంటాం. వేలం జరిగే ప్రాంతాల్లో రాస్తారోకో అందోళనలు చేపట్టనున్నాం.
-ఎన్. రంగారావు, శనగ రైతుల సంఘం
ప్రకాశం జిల్లా అధ్యక్షుడు