
విద్యార్థిని కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్
ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో ఏడుగురు నిందితులను తిరుచానూరు పోలీసులు బుధవారం అరెస్టుచేశారు.
తిరుచానూరు: ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో ఏడుగురు నిందితులను తిరుచానూరు పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. సీఐ సురేంద్రనాయుడు విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుమల వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న నాగమణి, ఈస్టు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాసమూర్తి దంపతుల కుమారుడు నితిన్‌కల్యాణ్ బీటెక్ పూర్తిచేసి చెన్నైలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సదుం మండలం బనుగుపల్లెకు చెందిన సదాశివరెడ్డి కుమార్తె, నితిన్‌కల్యాణ్ ప్రేమించుకుని విడిపోయారు. సదాశివరెడ్డి కుమార్తె రేణిగుంట సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో 21వ తేదీన ఆమె కళాశాలలో పరీక్ష రాసి తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతోంది.
అదే సమయంలో నితిన్‌కల్యాణ్, అతని స్నేహితులు నవీన్, సాయికృష్ణ, లోకేష్, అరుణ్‌కుమార్, అనిల్‌కుమార్, స్నేహితురాలు యాస్మిన్ ఇష్రాయిత్ రెండు కార్లలో వచ్చి వారిని అడ్డగించారు. విద్యార్థినిని కిడ్నాప్ చేసి అప్పలాయగుంట శివాలయంలో ఆమెను బలవంతంగా నితిన్‌కల్యాణ్ పెళ్లి చేసుకుని హైదరాబాదుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నితిన్‌కల్యాణ్ కళ్లుగప్పి ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు తిరుపతి ఈస్టు డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ సురేంద్రనాయుడు నిందితుడు నితిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో విద్యార్థినిని వెతుక్కుంటూ తిరుపతి వచ్చిన నితిన్, అతని స్నేహితులను తుమ్మలగుంట క్రాస్‌లో అరెస్టు చేశారు. విలేకర్ల సమావేశంలో ఎస్‌ఐలు చిరంజీవి, వెంకటనరసింహ, ఏఎస్‌ఐలు ఈఎంఎస్ నాయుడు, శంకరయ్య పాల్గొన్నారు.