వేధిస్తున్న వసతుల కొరత | Tenth class examinations from tomorrow | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న వసతుల కొరత

Mar 20 2016 3:24 AM | Updated on Jul 11 2019 5:12 PM

వేధిస్తున్న వసతుల కొరత - Sakshi

వేధిస్తున్న వసతుల కొరత

పట్టణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు సుమారు 3,220 మంది హాజరవుతారు.

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
కేంద్రాల్లో కనిపించని కనీస సదుపాయాలు

 
హిందూపురం టౌన్
: పట్టణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు సుమారు 3,220 మంది హాజరవుతారు. వారి కోసం అధికారులు పట్టణంలో 11 పరీక్ష కేంద్రాలు ఎంపిక చేశారు. అయితే గతంలో పరీక్ష కేంద్రాల్లో కనీస సదుపాయాలు సైతం లేకపోవడంతో విద్యార్థి సంఘాల వారు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయినప్పటికీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు అరొకర వసతుల నడుమే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రాల్లో మాత్రం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

11 కేంద్రాల్లో 3,220 మంది విద్యార్థులు
పట్టణంలోని కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 360 మంది, దీప్తిలో 200 మంది, అజీజియాలో 300 మంది, ఎంజీఎంలో 300 మంది, చిన్మయాలో 340 మంది, నేతాజీలో 260 మంది, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 280 మంది, సరస్వతీ విద్యామందిరంలో 320 మంది, బాలజీలో 300 మంది, బాలాయేసులో 300 మంది, బసవనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో 260 మంది విద్యార్థులు కలిపి మొత్తం 3220 మంది పట్టణంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

అరకొర వసతులు
పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న పలు పరీక్ష కేంద్రాల్లో అరొకర వసతులే ఉన్నాయి. బసవనపల్లిలో 150 బెంచీలు, నేతాజీలో 180, సరస్వతీ విద్యామందిరంలో 160, అజీజియాలో 150, ఎంజీఎంలో 120, కొట్నూరులో 150 బెంచీలు కొరతగా ఉన్నాయి. అంతేకాకుండా నేతాజీ పురపాలక ఉన్నత పాఠశాలలో కొన్ని గదులు చీకటి గానే ఉన్నాయి. ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతాయో తెలియని విధంగా దర ్శనమిస్తున్నాయి. పలు పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు సైతం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురికావాల్సిన పరిస్థితులు నెలకొంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
 
 అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
 జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు పట్టణంలో 11 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలల సహకారంతో కొన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలు కూడా సమకూర్చాం. - గంగప్ప, ఎంఈఓ, హిందూపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement