బహ్రెయిన్‌లో తెలుగు కార్మికుల కష్టాలు | telugu workers struggle in bahrain | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్‌లో తెలుగు కార్మికుల కష్టాలు

Jun 22 2015 8:19 AM | Updated on Sep 3 2017 4:11 AM

పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల వారిని అక్క డి కంపెనీ యాజమాన్యాలు వంచిస్తున్నాయి.

 మోర్తాడ్: పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల వారిని అక్క డి కంపెనీ యాజమాన్యాలు వంచిస్తున్నాయి. ఏజెంట్ల మోసానికి కంపెనీ యాజమాన్యం వంచన కూడా తోడు కావడంతో తెలుగు కార్మికులకుది దిక్కుతోచని పరిస్థితి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాలల్లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, కడప, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 126 మంది కార్మికులు నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లారు. అక్కడి కన్‌స్ట్రక్షన్ కంపెనీలైన అట్లాస్, టీఎంఎస్‌లలో పనికి కుదిరారు. హైదరాబాద్‌కు చెందిన రావు అలియాస్ రెడ్డి, తమిళనాడుకు చెందిన ఖాదర్‌సాహెబ్, నిజామాబాద్‌కు చెందిన శేఖర్ అనే ఏజెంట్ల ద్వారా వీరు బహ్రెయిన్‌కు వెళ్లారు. ఒక్కో కార్మికుడు వీసా కోసం రూ. 65 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు చెల్లించారు.

 

రోజు ఎనిమిది గంటల పాటు డ్యూటీ, ఇండియన్ కరెన్సీలో నెలకు రూ.20 వేల వరకు వేతనం చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంది.కార్మికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నారు. బహ్రె యిన్ వెళ్లిన తరువాత వసతి, భోజనం కల్పించినా, చేసిన పనికి యాజమాన్యం మాత్రం వేతనం చెల్లించడం లేదని జిల్లాకు చెందిన పలువురు కార్మికులు ‘సాక్షి’కి ఫోన్‌లో సమాచారం అందించారు. కార్మికులకు మూడు నెలల వేతనాన్ని యాజమాన్యాలు చెల్లించాల్సి ఉంది. భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని కార్మికులు తెలిపారు. ఇటీవల బహ్రెయిన్‌లో పర్యటించిన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు తాము ఫిర్యాదు చేసినట్లు కార్మికులు తెలిపారు. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్మికులు వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement