టీ ముసాయిదా రెడీ అవుతోంది: దిగ్విజయ్‌ | Telangana Draft to be Ready: Digvijay Singh | Sakshi
Sakshi News home page

టీ ముసాయిదా రెడీ అవుతోంది: దిగ్విజయ్‌

Sep 26 2013 1:18 AM | Updated on Aug 14 2018 3:55 PM

టీ ముసాయిదా రెడీ అవుతోంది: దిగ్విజయ్‌ - Sakshi

టీ ముసాయిదా రెడీ అవుతోంది: దిగ్విజయ్‌

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ ముసాయిదాను తయారు చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు.

* హోంశాఖ రూపొందిస్తున్న ఈ ముసాయిదా వీలైనంత త్వరగా కేబినెట్‌ ముందుకు వస్తుంది.. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి పంపుతాం
* ఏపీఎన్జీవోలు సమ్మె విరమించాలని చేతులు జోడించి కోరుతున్నా
* ప్రైవేటు వ్యవస్థ అంతా నడుస్తున్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు మూసేశారు?
* కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి
* ఆయన అన్ని ప్రాంతాల బాధ్యతను తీసుకోవాలి
* సోనియాతో భేటీ.. రాష్ట్రంలోని పరిస్థితులు, సమైక్య ఉద్యమంపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ ముసాయిదాను తయారు చేస్తోందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ఈ ముసాయిదా సాధ్యమైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ ముందుకు వస్తుందని చెప్పారు. కేబినెట్‌ ముందుకు వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామన్నారు. అయితే ముసాయిదా ఎప్పట్లోగా కేబినెట్‌ ముందుకు వచ్చేది తనకు తెలియదని, దీనిపై హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేనే అడగాలని సూచించారు.

బుధవారం ఉదయం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో దిగ్విజయ్‌ భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, సీమాంధ్ర ఉద్యమాలపై వివరణ ఇచ్చారు. ఎంపీలు, కేంద్ర మంత్రుల రాజీనామా అంశాలపైనా చర్చించారు. ఈ సమావేశం అనంతరం దిగ్విజయ్‌ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముసాయిదాను హోంశాఖ తయారు చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ ముసాయిదా కేబినెట్‌ ముందుకు వస్తుంది. అనంతరం ఏపీ అసెంబ్లీకి పంపుతారు’’ అని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏపీఎన్జీవోల సమ్మెపై ప్రశ్నించగా.. ఎన్జీవోలు సమ్మె విరమించాలని చేతులు జోడించి కోరుతున్నా నని అన్నారు. ఉద్యోగుల ప్రతి సమస్యను వినేందుకు, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదే సమయంలో సమ్మె జరుగుతున్న తీరుపై ఘాటుగా స్పందించారు.

‘‘ఉద్యోగుల సమ్మెతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు దుకాణాలు, పాఠశాలలు, వైద్యశాలలు, రవాణా వ్యవస్థ మొత్తం నడుస్తోంది. ప్రైవేటు వ్యవస్థ అంతా నడుస్తున్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఎందుకు మూసేశారు? మేం అందరి అభ్యంతరాలు వినేందుకు సిద్ధంగా ఉన్నాం. అందరి క్షేమాన్ని చూసుకుంటాం. మీరు విధుల్లోకి రండి. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి సమస్యను పరిష్కారిస్తాం’’ అని పేర్కొన్నారు.

అందరూ ఎన్నుకుంటే సీఎం అయ్యారు
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంత పక్షపాతిగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను కొందరు విలేకరులు దిగ్విజయ్‌ వద్ద ప్రస్తావించగా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘ఆయన సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అన్ని ప్రాంతాల వారు కలిసి ఎన్నుకుంటే సీఎం అయ్యారు. ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల బాధ్యతను ఆయన తీసుకోవాలి’’ అని సూచించారు.

కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకున్నందునే జగన్‌కు బెయిల్‌ వచ్చినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను కొందరు విలేకరులు ప్రస్తావించగా.. ‘‘జగన్‌తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుంటే.. బీజేపీతో టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకుందా’’ అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడిన విషయంపై ప్రశ్నించగా.. ‘‘ఎంపీలెవరూ రాజీనామాలు చేయవద్దని కోరుతున్నా. రాజీనామాలతో ఎలాంటి ఫలితం ఉండదు’’ అని దిగ్విజయ్‌ పేర్కొన్నారు.

ఏపీ పర్యవేక్షణ బాధ్యత రాహుల్‌కు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలను ఇక రాహుల్‌ గాంధీ నేరుగా పర్యవేక్షించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లినందువల్ల రాష్ట్ర వ్యవహారాలను రాహుల్‌ స్వయంగా చూడనున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలన్నింటినీ అధిష్టానం ముఖ్యులు ఇక రాహుల్‌ దృష్టికి తీసుకెళతారు. పార్టీ ఉపాధ్యక్షుడి సలహాలు, సూచనల మేరకు ముందుకెళతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement