వెన‘కేసు’కొస్తున్నారు..!

TDP Supports Land Grabbing And Sand Mafia - Sakshi

ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రుణాల వ్యవహారం

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కుమారుడిపై కేసు

ఫిర్యాదు చేసి 15 రోజులైనా ముందుకు కదలని వైనం

కేసు మాఫీకి తెర వెనుక యత్నాలు

భీమవరం ఎమ్మెల్యే వద్ద టీడీపీ నాయకుల పంచాయితీ

పశ్చిమగోదావరి, భీమవరం: ఇసుక మాఫియా, భూఆక్రమణల దందాలలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యాంకులనూ వదలడం లేదు. ఫోర్జరీ సంతకాలు, బినామీ పేర్లతో అక్రమంగా రుణాలు పొంది బ్యాంకులకు శఠగోపం పెడుతున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల కుటుంబ సభ్యులు సైతం పైరవీలు, అక్రమాలకు తెరతీస్తున్నారు. ఇటువంటి కోవకు చెందినదే  వీరవాసరం మండలం నవుడూరు గ్రామంలోని ఆంధ్రాబ్యాంకులో మండల వ్యవసాయశాఖాధికారి సంతకం ఫోర్జరీ చేసి కౌలు రైతులకు తెలియకుండానే రుణాలు పొందడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సాక్షాత్తు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాలా వెంకటేశ్వరరావు కుమారుడు వ్యవసాయశాఖలో ఎంపీఈఓగా పనిచేస్తున్న పాలా హర్షవర్ధన్‌ శివప్రసాద్‌ పమ్రేయం ఉండటం దీనిపై మండల వ్యవసాయశాఖాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసును మాఫీచేయడానికి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వద్ద పంచాయితీ నడుస్తోంది. హర్షవర్ధన్‌ వ్యవసాయశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీఈఓగా కొంతకాలంగా పనిచేస్తున్నాడు.

గతేడాది కొంద రు కౌలురైతులను గ్రూపులుగా ఏర్పాటుచేసినట్లు చూపించి నవుడూరు ఆంధ్రా బ్యాంకులో మండల వ్యవసాయశాఖాధికారి రాజశేఖర్‌ సంతకాలు ఫోర్జరీ చేసి వ్యవసాయ పెట్టుబడి రుణాలు సుమా రు రూ.20 లక్షలకు పైగా తీసుకున్నట్టు  రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి ముందు రు ణాలు మంజూరైన కౌలు రైతుల గ్రూపుల సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు పడటం వాటిని వెంటనే మరో ఖాతా కు మళ్లించడంతో అనుమానం వచ్చి బ్యాంకు అధి కారులను ఆరా తీయగా పొరపాటున ఖాతాలో సొమ్ములు జమ అయినట్టు చెప్పి పంపించి వేశారు. ఈ విషయం ఆయా గ్రూపుల రైతులు రాజశేఖర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బ్యాం కు  అధికారులను  సంప్రదించగా ఫోర్జరీ వ్యవహారం బయటపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వ్యవసాయశాఖ, బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే ఫోర్జరీ సంతకాలతో దాదాపు రూ.50 లక్షలకుపైగానే రుణాలు పొందారని, వీటిని రైతులకు అందకుండా హర్షవర్ధన్‌ వాడుకున్నాడనే ప్రచారం ఉంది.

ఒత్తిళ్లు.. పైరవీలు
బ్యాంకులో ఫోర్జరీ సంతకాల వ్యవహారంతో వీరవాసరం మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట మసకబారుతోందని, ఈ కేసు నుంచి హర్షవర్ధన్‌ శివప్రసాద్‌ను తప్పించాలని కొందరు పార్టీ పెద్దలు ఇటీవల ఎమ్మెల్యే రామాంజనేయులు వద్ద పంచాయితీ పెట్టినట్టు తెలిసింది. మండల వ్యవసాయశాఖాధికారి రాజశేఖర్, ఎంపీఈఓ హర్షవర్ధన్‌ శివకుమార్‌ మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలు కారణంగానే కేసులో ఇరికించారని, దీనిలో హర్షవర్ధన్‌ ప్రమేయం లేదని ఎమ్మెల్యేకు చెప్పి కేసును మాఫీ చేయించాల్సిందిగా కోరినట్టు తెలిసింది. వ్యవసాయశాఖాధికారి పోలీసులకు ఫిర్యాదుచేసి 15 రోజులు గడిచినా టీడీపీ నాయకుల పైరవీల కారణంగానే ఇంతవరకు అరెస్టు చేయలేదని తెలుస్తోంది. టీడీపీలో విభేదాలు కారణంగా మరి కొందరు నాయకులు ఫోర్జరీ వ్యవహారంలో లొసుగులను అధికారులకు అందిస్తున్నట్టు తెలిసింది. ఫోర్జరీలతో పార్టీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతినగా పార్టీ నాయకులు కేసును మాఫీ చేయించడానికి చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు తావిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top