ఎయిర్‌పోర్టు నిర్వాసితులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం

TDP MLA Vallabhaneni Vamsi Rowdyism On Airport Expats - Sakshi

మెడపట్టుకుని బయటకు గెంటిన వల్లభనేని వంశీ

నిర్వాసితులపై దాడి చేసిన ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది

రాస్తారోకో చేసిన బాధితులను అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, గన్నవరం : విమానాశ్రయ భూనిర్వాసితులు శనివారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పది రోజులుగా ఆందోళన చేస్తున్న తమను చర్చల పేరుతో ఎమ్మెల్యే ఇంటికి పిలిచి దుర్భాషలాడుతూ కాలర్‌ పట్టుకుని బయటకు గెంటివేయడంతోపాటు వ్యక్తిగత సిబ్బందితో దాడి చేయించారని మైనార్టీ వర్గానికి చెందిన బాధితులు ఆరోపించారు. వివరాల్లోకెళ్తే.. పెద్దఅవుటపల్లికి చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు షేక్‌ హైదర్‌సాహెబ్, మేడూరి తిరుపతయ్య, ఆయన కుమారుడు వినోదరావుకు 1974లో అప్పటి తహసీల్దార్‌ చిన్నఅవుటపల్లి గ్రామ పరిధిలో 1.10 ఎకరాల చొప్పున రెండు ఎకరాల ఇరవై సెంట్లు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల వారసులు ఆ భూమికి శిస్తు కట్టుకుంటూ సాగు చేసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం వీరి భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. అయితే ఎటువంటి పరిహారం చెల్లించకపోవడంతో గత పది రోజులుగా సదరు భూముల్లో పనులు జరగకుండా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇంటికి రావాల్సిందిగా నిర్వాసితులను కాంట్రాక్టర్‌ పిలిపించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిర్వాసితులు మల్లవల్లి, కొండపావులూరు, వీరపనేనిగూడెంలో ప్రభుత్వ భూముల సాగుదారులకు పరిహారం చెల్లించారని మాకెందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన వంశీ నిర్వాసితుల్లో ఒకరైన షేక్‌ అబ్దుల్లాను కాలర్‌ పట్టుకుని ఈడ్చుకువెళ్లి బయటకు నెట్టేశారని అక్కడే ఉన్న వీరి బంధువులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది దాడిచేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నిర్వాసితులు ఆయన ఇంటి ముందే గన్నవరం–పుట్టగుంట ఆర్‌ అండ్‌ బీ రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు స్టేషన్‌లోనే నిర్బంధించారు. రోడ్డుపై ధర్నాకు దిగినందుకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా, చర్చల పేరుతో తమను ఇంటికి పిలిచి దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు దుర్భాషలాడి, సిబ్బందితో కొట్టించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్వాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతుగా నిలిచారు.

పోలీస్‌స్టేషన్‌ ముందు బాధితుల ధర్నా
నిర్వాసితులపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఆయన గన్‌మెన్‌పై కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్‌ చేశారు. బాధితులతో కలిసి శనివారం రాత్రి ఆమె పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. రాస్తారోకో చేసిన బాధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బాధితులను స్టేషన్‌లో నిర్బంధించి ఆహారం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. బాధితులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top