బాబు లేఖతోనే విభజనకు అంకురార్పణ | tdp letter lead to state bifurcation, says ramachandiraiah | Sakshi
Sakshi News home page

బాబు లేఖతోనే విభజనకు అంకురార్పణ

Feb 23 2014 12:53 AM | Updated on Sep 27 2018 5:59 PM

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖతోనే రాష్ట్ర విభజనకు అంకురార్పణ జరిగిందని మంత్రి సి.రామచంద్రయ్య ఆరోపించారు.

 సి.రామచంద్రయ్య ఆరోపణ

 సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన లేఖతోనే రాష్ట్ర విభజనకు అంకురార్పణ జరిగిందని మంత్రి సి.రామచంద్రయ్య ఆరోపించారు. విభజనకు అంగీకరిస్తూ లేఖ ఇచ్చిన చంద్రబాబు తీరా ఆ ప్రక్రియ మొదలయ్యేటప్పటికీ సమన్యాయం కావాలని గందరగోళం సృష్టించారన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ.. విభజన జరుగుతున్నపుడు సీమాంధ్రకు ఏం కావాలో ప్రతిపాదనలు చేయకుండా చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారన్నారు. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న బాబు సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. అసలు విభజనపై ఆయన  వైఖరి ఏమిటో కూడా స్పష్టంగా చెప్పలేకపోయారని, జాతీయ పార్టీల నేతల వద్దగానీ, కరణ్ థాపర్ వంటి ప్రఖ్యాత జర్నలిస్టులకుగానీ చంద్రబాబు సరైన సమాధానం ఇవ్వలేకపోయారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంత నేపథ్యం గల బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఎందుకు తాపత్రయపడుతున్నారని రామచంద్రయ్య ప్రశ్నించారు. అయితే, ఈ రోజు సీమాంధ్రకు ఏమైనా వచ్చిందీ అంటే అది కాంగ్రెస్, బీజేపీ సహకారంతో చేసిందేనన్నారు. అందుకు తాను బీజేపీకి అభినందనలు తెలుపుతున్నానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement