అవును.. అవి దొంగ పట్టాలే!

TDP Leaders Kabza NSP Lands In Ongole - Sakshi

ఎన్నికలకు ముందు ఎన్‌ఎస్‌పీ స్థలం, రైతుల పొలాల్లో టీడీపీ నేతల పాగా

తమ భూముల్లో ఆక్రమణలు తొలగించాలని తహసీల్దారును కోరిన ఎన్‌ఎస్‌పీ అధికారులు

20 మందికి నోటీసులు జారీ

అక్టోబరు 1లోగా వివరణ ఇవ్వాలని తహసీల్దారు ఆదేశం

సాక్షి, ఒంగోలు: స్వార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు అడ్డదారిలో పట్టాలు పొందేందుకు యత్నించారన్న వాదన ఇప్పుడు నిజమేనని రుజువైంది. నాడు అధికార టీడీపీ ఒత్తిడికి తలొగ్గి పోలీసు అధికారులు సైతం ఆక్రమణలను అడ్డుకున్న మహిళలపై తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు కూడా నమోదు చేశారు. నాడు వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా నిలిచి నిలదీయడంతో బాధితులు కాస్త ఊపిరి పీల్చుకోగలిగారు. నేడు ఎన్‌ఎస్‌పీ అధికారులు ఆ భూమి తమదేనని, ఆ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించాలంటూ ఒంగోలు తహసీల్దారుకు విజ్ఞప్తి చేయడం, ఈమేరకు 20 మందిని ఆక్రమణదారులుగా పేర్కొంటూ తహసీల్దారు చిరంజీవి నోటీసులు జారీ చేయడంతో నాడు చూపించిన పట్టాలన్నీ దొంగ పట్టాలే అన్నది స్పష్టమైంది.

అడ్డదారిలో ఆక్రమణకు యత్నం..
ఇళ్ల పట్టాలు అంటే నివాసం ఉండేందుకు జాగాలేని వారికి ఇచ్చేవి. ఇందుకు వారికి తెల్లరేషన్‌ కార్డు తప్పనిసరి. కానీ, సొంత కారు ఉన్న వారు, మెడలో బంగారు కాసులతో దిగినవారు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. ఒంగోలు సౌత్‌ బైపాస్‌లోని ఎన్‌ఎస్‌పి స్థలంతోపాటు సమీపంలోని రైతుల పొలాలను సైతం దున్నేయడం ప్రారంభించారు. తమ భూమిలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన వారిని తెలుగు మహిళలు దురుసుగా ప్రవర్తించారు. తమ భూమిని ఆక్రమించుకోవడం ఏమిటన్న ఓ ముస్లిం కుటుంబాన్ని అయితే కేశవరాజుకుంట రోడ్డెక్కే వరకు తరిమి తరిమి కొట్టారు. తాము గతంలోనే కొనుగోలు చేశామంటూ వారు వేడుకున్నా మాకు నాటి ఎమ్మెల్యే ఇచ్చారంటూ హెచ్చరికలు చేశారు. వీరికి మద్దతు పలికిన ఓ పోలీసు అధికారి తన సిబ్బందిని పంపించి జనాన్ని బలవంతంగా అక్కడి నుంచి పంపేందుకు యత్నించడంతో వివాదం మరింత జఠిలంగా మారింది.

సంతకాలు కూడా లేకుండానే పట్టాలు జారీ
ఇదిలా ఉంటే పట్టాలు చూపించాలంటూ కొందరు అడ్డం తిరగడంతో కొందరు తెలుగు మహిళలు పట్టాలు చూపించారు. తీరా వాటిలో కొన్ని పట్టాలలో తహసీల్దారు స్టాంపు ఉన్నచోట సంతకాలు ఉంటే, మరికొన్ని పట్టాలలో కనీసం తహసీల్దారు సంతకం కూడా లేకపోవడం గమనార్హం. దీంతో అసలు పట్టాలు రెవెన్యూ అధికారులే ఇచ్చారా లేదా అంటే అప్పటి తహసీల్దారు విచారణ చేస్తున్నా...పరిశీలిస్తున్నా అంటూ చెప్పడమే తప్ప తేల్చలేకపోయారు. ఇదే సమయంలో అసలు విషయం బహిర్గతమైంది. భూమి వృథాగా ఉందని, దానిని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఎన్‌ఎస్‌పి ఈఈ రవి అప్పట్లో తహసీల్దారు కార్యాలయానికి లేఖ రాశారు.

కానీ ఆ భూమి కన్వర్షన్‌ కాలేదు. దీంతో ఆ భూమి తమ ఆధీనంలో ఉన్నట్లుగా ఎన్‌ఎస్‌పి అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎన్‌ఎస్‌పి స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఎలా జారీ చేశారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై పలువురు తాలూకా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లరాదంటూ పోలీసులు ఆదేశించినా పోలీసులు అక్కడ ఉండగానే కొందరు భూమిలో నిర్మాణాలు ప్రారంభించారు.  నిర్మాణాలను అడ్డుకోబోయిన స్థానిక మహిళలపై ఏకంగా పోలీసులు తమ విధులను అడ్డుకున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

రంగంలోకి దిగిన బాలినేని
విషయం రచ్చరచ్చగా మారుతుండడం, చివరకు మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నామంటూ ప్రకటించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగారు. అప్పటి వరకు అధికారులే సమస్యను పరిష్కరిస్తారని భావించిన ఆయన పరిస్థితి శ్రుతిమించుతుందని భావించి నేరుగా కాలనీకి వెళ్లారు. ఎన్‌ఎస్‌పి స్థలంలో అధికార పార్టీ నేతలకు పట్టాలు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ఎన్‌ఎస్‌పి భూమిలో ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్లాట్లుగా మార్చి పొజిషన్‌ చూపిస్తే వాటికి మీరు సహకరిస్తారా అంటూ నిలదీయడంతో పోలీసులు ఒకడుగు వెనక్కు తగ్గారు. దీంతో పోలీసులు ఆ భూమిలోకి ఎవరూ వెళ్లడానికి వీల్లేదంటూ హెచ్చరికలు జారీచేయడం, మరో వైపు అప్పటి జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ భూమికి సంబంధించి విచారణ చేయిస్తున్నట్లు ప్రకటించడం, ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కూడా మారడంతో వివాదం కొంతమేర సద్దుమణిగింది.

20మందికి నోటీసులు జారీ
అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసిన ఎన్‌ఎస్‌పి అధికారులు మొత్తం 4.37 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని, ఆ భూమి తమదే అని గుర్తించారు. ఆ భూమిలోని ఆక్రమణలు తొలగించి తమ భూమికి రక్షణ కల్పించాలంటూ ఎన్‌ఎస్‌పి అధికారులు తాజాగా ఒంగోలు మండల తహసీల్దారుకు లేఖ రాశారు. తమ విచారణలో తమ భూమిలో 20మంది పట్టాలు వేసుకున్నట్లుగా గుర్తించామని పేర్కొంటూ వారి పేర్లు జత చేశారు. దీంతో వారందరికీ ఒంగోలు మండల తహసీల్దారు చిరంజీవి మంగళవారం నోటీసులు జారీ చేశారు. అక్టోబరు 1వ తేదీలోగా ఆక్రమణలను ఎందుకు తొలగించరాదో సమాధానం చెప్పాలంటూ నోటీసులలో పేర్కొన్నారు. దీంతో వారి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top