వైఎస్సార్‌ సీపీపై కుట్ర

TDP Leaders And Police Threats to YSRCP leaders in West Godavari - Sakshi

దళితులను కించపరిచిన చింతమనేనిపై చర్యలు శూన్యం

దెందులూరు ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చిన సీఎం చంద్రబాబు

వీడియో పోస్టు చేసిన దళిత నేత కత్తుల రవికుమార్‌ అరెస్ట్‌

హైడ్రామా అనంతరం కోర్టుకు.. సాయంత్రానికి బెయిల్‌

వైఎస్సార్‌ సీపీయే మార్ఫింగ్‌ చేయించిందనేలా టీడీపీ ప్రచారం

చింతమనేనికి, టీడీపీకి బుద్ధి చెబుతామంటున్న దళితులు

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఏలూరు టౌన్‌: ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనికి భిన్నంగా ఆయనను వెనకేసుకొచ్చారు. వైఎస్సార్‌ సీపీ వారే మార్ఫింగ్‌ చేసి వారే ప్రచారం చేస్తుంటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో పోలీసులు కదిలి ఈ కుట్ర మొత్తం వైఎస్సార్‌ సీపీకి ఆపాదించే పనిలో పడ్డారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దళితుల మనోభావాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో వైరల్‌ కావటంతో రాష్ట్ర వ్యాప్తంగాదళితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాలోని పలు స్టేషన్లలో చింతమనేనిపై పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదులు చేసినా కదలని పోలీసులు ఈ వీడియోని పోస్టు చేసిన వైఎస్సార్‌ సీపీ దళిత నేత కత్తుల రవికుమార్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.

పెదపాడులోని ఇంటిలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని పెదపాడు, ఏలూరు రూరల్, ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్లకు తిప్పారు. రవికుమార్‌ అరెస్ట్‌లో పోలీసు అధికారుల హైడ్రామా విమర్శలకు తావిస్తోంది. ఉదయం రవికుమార్‌ను ఇంటివద్ద నుంచి మాట్లాడే పనుందంటూ తన బండిపై ఎక్కించుకుని వచ్చిన పెదపాడు పోలీసులు.. చివరికి సీఐతో మాట్లాడాలంటూ ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు.. అనంతరం త్రీటౌన్‌లో కేసు నమోదు చేశారంటూ ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ రవికుమార్‌ను విచారించిన పోలీసులు ఈ నెపాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై వేసేందుకు కుట్ర చేశారు. ఎవరు పోస్టు చేయమన్నారు? నీకు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? పోస్టు చేస్తే నీకు పార్టీ ఎంత డబ్బులు ఇస్తుందంటూ? ప్రశ్నలు వేశారు. పార్టీ ఆదేశాల మేరకే చింతమనేనికి సంబంధించిన వీడియోను మార్ఫింగ్‌ చేసి పోస్టు చేశాడని, అది వైఎస్సార్‌ సీపీ చేయించిందనేలా దళితులను తప్పుదోవపట్టించేలా టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు కుట్రకు తెరతీశారు.

పోలీసుల హైడ్రామా
రవికుమార్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేసిన పోలీసులు సాయంత్రం కోర్టుకు తీసుకువెళ్తామంటూ హాజరుపరిచారు. అనంతరం రవికుమార్‌ను ఎమ్మెల్యే చింతమనేని ఇంటివైపు కార్లను స్పీడుగా తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన వైఎస్సార్‌ సీపీ నేతలు, దళిత నేతలు పోలీసుల కార్లను వెంబడించారు. శనివారపుపేట గాలిగోపురం నుంచి మళ్లీ వెనక్కి తిప్పి నగరంలోని సందులు, గొందులు తిప్పారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ హైడ్రామాతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. పార్టీ నేతలు, శ్రేణులు ఏమి జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు చివరికి కోర్టు వద్దకు తీసుకువచ్చి దింపివేశారు.

న్యాయమూర్తి సెల్ఫ్‌బాండ్‌తో బెయిల్‌
పోలీసులు చెబుతున్నట్టు రవికుమార్‌ సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన వీడియో మార్ఫింగ్‌ చేసింది కాదు. ఎడిటింగ్‌ చేయలేదు. కేవలం వీడియోలోని ఒక భాగాన్ని కట్‌ చేసి పోస్టు చేశారు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటువంటి కేసుల్లో పోలీసు స్టేషన్‌లోనే 41 సీఆర్‌పీ నోటీసు ఇవ్వాల్సి ఉంది. ఇదే విషయాన్ని న్యాయమూర్తికి వివరించటంతో న్యాయమూర్తి సెల్ఫ్‌ బాండ్‌తో బెయిల్‌ ఇచ్చారు. రవికుమార్‌పై 505 క్లాజ్‌–2 రెడ్‌విత్‌ 34 ఐపీసీతో కేసు నమోదు చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం.– న్యాయవాదులు లక్ష్మీకుమార్, శశిధర్‌రెడ్డి

పోలీసు రాజ్యం నడుస్తోంది
రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా పోలీసు రాజ్యం నడుస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. దళితులపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాన్ని పట్టించుకోని ప్రభుత్వం, పోలీసులు దళితుల ఆత్మగౌరవం కోసం వీడియోను పోస్టు చేస్తే కేసులు పెట్టడం అన్యాయం. ఆఖరికి సీఎం సైతం చింతమనేనిని వెనకేసుకురావటం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. దళితులపై దాడులు జరుగుతున్నా, హీనంగా చూస్తున్నా పట్టించుకోని దుస్థితి నెలకొంది. దళితుల మనోభావాలను దెబ్బతీసిన చింతమనేనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తాం. రాబోయే కాలంలో దళితులంతా ఐక్యంగా టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.– కొయ్యే మోషేన్‌రాజు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top