హైలెవల్‌ బ్రిడ్జి..అభూత కల్పనే

TDP government Failed To Construct High-Level Bridge Between Thotla Valluru And Pamulalanka - Sakshi

సాక్షి, గుంటూరు : తోట్లవల్లూరు–పాములలంక మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కలగా మారింది. రాజధాని నిర్మాణం నుంచి గ్రామస్థాయి పనుల వరకు టీడీపీ సర్కార్‌ చేస్తున్న గ్రాఫిక్స్‌ మాయలో పాములలంక హైలెవల్‌ బ్రిడ్జి ‘అభూత కల్పన’లాగే మిగిలిపోయింది. ఆరు నెలల నుంచి ఇదిగో వంతెన నిర్మాణం, అవిగో పనుల ప్రారంభం అంటూ ఊరిస్తూ..ఉసూరుమనిపించిన టీడీపీ నేతల మాయాజాలంపై సాక్షి ప్రత్యేక కథనం.

వివరాలలోకి వెళితే..కృష్ణానది గర్భంలో  పాములలంక గ్రామం ఉంది. సుమారు 1500 జనాభా  నివసిస్తున్నారు. వీరంతా దళితులు. వ్యవసాయా«న్ని నమ్ముకునే గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. తోట్లవల్లూరుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. మామూలు సమయాలలో తాత్కాలిక రహదారిపై ప్రయాణించే స్థానికులు, వరదల సమయంలో పడవలపై రాకపోకలు సాగిస్తుంటారు.

రూ.30 కోట్లు మంజూరు
కృష్ణానదిపై తోట్లవల్లూరు–పాములలంక మధ్య హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు అనేక ఏళ్లుగా కోరుతున్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరై, శంకుస్థాపన జరిగి కూడా పనులు ప్రారంభం కాలేదు. తాజాగా గత ఏడాది కాలంగా వంతెన నిర్మాణానికి  ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.30 కోట్లు మంజూరయ్యాయని, పనులు త్వరలో ప్రారంభిస్తామని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన చెబుతూ వచ్చారు. గత డిసెంబర్‌లో సీఎం సతీమణి భువనేశ్వరి దత్తత గ్రామం పామర్రు మండలం కొమరవోలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనులకు సంభందించిన శిలాఫలకం కూడా ఆవిష్కరిస్తారని అప్పట్లో ప్రకటించారు. 

జాడలేని పనులు
వంతెన నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూసేకరణ జరపకుండా, వంతెన నిర్మాణ పనులను దక్కించుకున్న వల్లభనేని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ గత నాలుగు నెలల కిందట నిర్మాణ ప్రాంతంలో కొంత హడావుడి చేసింది. సిబ్బంది కోసం తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయటంతోపాటు కొంత నిర్మాణ సామాగ్రి, యంత్రాలను కూడా నిర్మాణ ప్రదేశానికి తరలించింది. వంతెన పనులను మాత్రం ఇంతవరకు ప్రారంభించలేదు. నిర్మాణ పనుల కోసం వచ్చిన క్షేత్రస్ధాయి సిబ్బంది కూడా రెండు నెలలుగా కానరావటం లేదు.

సాక్షాత్తు  ముఖ్యమంత్రి చంద్రబాబు హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారని ఎమ్మెల్యే కల్పన చెబుతుండగా, మరి వంతెన పనులు జరపకుండా నిర్మాణ సంస్థ ఎందుకు ఉంటోందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు చంద్రబాబు శంకుస్థాపన చేశారా లేదా లేక ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి టీడీపీ నేతలు ఏమైనా డ్రామా ఆడుతున్నారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. వంతెన పేరుతో గత పదేళ్లుగా తమను పాలకులు మోసం చేస్తూనే ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పనులు ఎందుకు ప్రారంభించరు
తోట్లవల్లూరు–పాములలంక మధ్య వంతెన నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు ఎమ్మెల్యే కల్పన గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నారు. పనుల శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించాడని కూడా సభల్లో చెబుతున్నారు. వంతెన పనుల కోసం నిర్మాణ సామగ్రిని కూడా తరలించిన కాంట్రాక్టర్‌ పనులను ఎందుకు నిలిపివేశాడో అర్థం కావటం లేదు. 
-సోలే నాగరాజు, పాములలంక 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top