డోన్‌లో తెలుగు తమ్ముళ్ల హల్‌చల్

డోన్‌లో తెలుగు తమ్ముళ్ల హల్‌చల్ - Sakshi


 డోన్ టౌన్ : అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. డోన్  పట్టణంలో తెలుగు తమ్ముళ్లు బరి తెగించారు. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గురువారం సాయంత్రం రద్దీగా ఉన్న చిగురుమానుపేటలోని అమ్మ హోటల్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై కొందరు రౌడీమూకలు తప్పతాగిన మైకంలో కత్తులు, రాడ్లతో దాడి చేయడంతో నడిరోడ్డులో ఈ దృశ్యాలను చూస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

 

దాడి వెనుక టీడీపీ చెందిన నాయకుల కుట్ర ఉందని బాధితులతో పాటు దాడిని ప్రత్యక్షంగా చూసిన పలువురు పేర్కొంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి రోడ్డులో బండల వ్యాపారం చేసే ఉప్పరి ఈశ్వరయ్య ఇటీవల జరిగిన మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల  విజయానికి కృషి చేశారు. పార్టీ కార్యకర్తగా ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీలో మంచి గుర్తింపు రావడం, పలువురితో పరిచయాలు ఉండటం, ఆర్థికంగా పలువురిని ఆదుకోవడం లాంటి పనులు ఈశ్వరయ్య చేస్తుండేవాడు.

 

జీర్ణించుకోలేని ఆ ప్రాంత టీడీపీ చోటా నాయకులు ఫైనాన్స్ విషయాలను సాకుగా చూపి రౌడీలను దాడికి ఉసిగొల్పారని బాధితుడి బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో బోయ ఈశ్వరయ్య, బోయ నాగరాజు, గిడ్డయ్య, పుల్లగుమ్మి మద్దిలేటి, రాజంపేట మల్లికార్జున తదితరులు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

ప్రాణాపాయ స్థితిలో ఈశ్వరయ్య...:


రౌడీ మూకల దాడిలో గాయపడ్డ ఉప్పరి ఈశ్వరయ్య కడుపులో కత్తిపోటు పడటంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్రథమ చికిత్స అందించిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పరిస్థితి విషమంగా మారటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు రెఫర్ చేశారు.

 

పెట్రేగిపోతున్న అధికార పార్టీ దాడులు...:

మూడు రోజుల క్రితం రాచర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీలో ఏఎస్‌ఓగా విధులు నిర్వహిస్తున్న అంకన్నపై అధికార పార్టీకి చెందిన వీరేష్, సురేష్‌గౌడ్ దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడంలో తాత్సరం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇంతలోనే డోన్ పట్టణంలో మరో సంఘటన చోటు చేసుకోవడంతో నిందితులపై పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top