అక్రమాలకు అడ్డేది?

Swarnamukhi River Sales in Tirupati - Sakshi

స్వర్ణముఖి నదిని  అమ్మేస్తున్నారు

హెచ్చరించినా లెక్కచెయ్యని అక్రమార్కులు

టీడీపీ నేతల అండదండలు

చర్యలకు వెనక్కు తగ్గిన అధికార యంత్రాంగం

సాక్షి, తిరుపతి: తిరుపతి పరిసర ప్రాంతాల్లో అక్రమార్కులకు అడ్డే లేకుండా పోతోంది. భూబకాసురులు స్వర్ణముఖి నదిని రోజురోజుకు కొద్దికొద్దిగా ఆక్రమించి అమ్ముకుంటున్నా అధికారులు చూస్తుండిపోతున్నారు. విషయం తెలిసి వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావడంతో వారు వెనుకడుగు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి రూరల్, తిరుచానూరు పరిధిలోని స్వర్ణముఖి నది పోరంబోకు భూములున్నాయి. అందులో సర్వే నంబర్‌ 360లో 178 ఎకరాలు ఉంది. ఈ భూమిని 2012 నుంచి ఆక్రమించడం ప్రారంభించారు. ఆ సమయంలో రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రారంభించిన ఆక్రమణలు ఈ ఐదేళ్ల కాలం నదిని దాదాపు పూర్తిగా ఆక్రమించేశారు. జేసీబీలు, టిప్పర్లతో కొంతకొంతగా పూడ్చుకుంటూ వస్తున్నారు.

బరితెగించిన టీడీపీ నేతలు
స్వర్ణముఖి నది స్థలంలో నాడు 50 నివాసాలు అక్రమంగా నిర్మిస్తే ప్రస్తుతం సుమారు 300కు పైగా నిర్మాణాలు వెలిశాయి. ఈ ఆక్రమణలను ఎప్పటికప్పుడు ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొస్తున్నా రెవెన్యూలో పనిచేసే ఇద్దరు అధికారుల సహకారంతో ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎన్నికల హడావుడిలో ఉండగా టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయారు. నదిని దాదాపు పూర్తిగా పూడ్చివేశారు. అందులో రాత్రికి రాత్రే తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన సబ్‌ కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ స్వర్ణముఖి నది ప్రాంతంలో పర్యటించారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఆ ప్రాంతంలో స్వర్ణముఖి నది పోరంబోకు భూమి అని బోర్డు కూడా ఏర్పాటుచేయించారు.

స్థానిక నాయకుడే కీలకం
స్వర్ణముఖి నది పోరంబోకు భూముల్లో స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్న ఓ నాయకుడు ఈ ఆక్రమణలకు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇతను స్వర్ణముఖి నదిని అమ్మడం ద్వారా సుమారు రూ.30 కోట్లకు పడగలెత్తినట్లు తెలిసింది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దామలచెరువు వద్ద విలువైన భూములను కొనుగోలు చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇక్కడ ఆదాయం రుచిమరిగిన ఓ రెవెన్యూ అధికారి తిరిగి ఇదే ప్రాంతానికి బదిలీపై వచ్చారు. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు చోటా నాయకుల కారణంగానే స్వర్ణముఖి నది పూర్తిగా ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఆక్రమణలపై ఎవరైనా వచ్చి అడిగితే.. వారికీ రెండు ప్లాట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి నోరెత్తకుండా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే స్వర్ణముఖి నది కనుమరుగవ్వక తప్పదని స్థానికంగా ఉన్న పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు
నదిలో ఎటువంటి ఆక్రమణలు జరగడానికి వీల్లేదని సబ్‌ కలెక్టర్‌ హెచ్చరించారు. రెవెన్యూ అధికా రులను అప్రమత్తం చేశారు. స్వర్ణముఖి నదిలో ఆక్రమణాలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వమని ఆదేశించారు. ఇద్దరు రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారిపోయారు. యథావిధిగా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. అందుకు టీడీపీ నాయకుల ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. నదిని ఆక్రమించి అమ్ముకుంటున్నా చూసీ చూడనట్లు ఉండమని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆ ఇద్దరు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. దీంతో ప్రతిరోజూ స్వర్ణముఖి నదిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top