‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి | sv mohan reddy demand for vigilance probe on chandranna Kanuka | Sakshi
Sakshi News home page

‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి

Published Mon, Jan 12 2015 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి

‘చంద్రన్న’ స్కాంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి

చంద్రన్న కానుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిస్తున్న నిత్యావసర సరుకుల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై విజిలెన్స్ శాఖతో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని కర్నూలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

* కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్
* సింగపూర్‌కు వందెకరాలివ్వడం దారుణం

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిస్తున్న నిత్యావసర సరుకుల కొనుగోలులో జరిగిన కుంభకోణంపై విజిలెన్స్ శాఖతో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని కర్నూలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘చంద్రన్న కానుక’కు టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన రూ.280 కోట్లలో 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ధ్వజమెత్తారు.

ఈ పథకం కింద  ప్రజలకు సరఫరా చేస్తున్న మొత్తం ఆరు రకాల సరుకుల మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కందిపప్పు, బెల్లం, నెయ్యి మార్కెట్ ధరలకు, టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలకు బాగా వ్యత్యాసం ఉందని చెప్పారు. సరుకులన్నీ పెట్టి ఇచ్చే గిఫ్ట్ సంచుల్లో కూడా భారీ కుంభకోణం జరిగిందన్నారు.

ఒక గిఫ్ట్ సంచి ధర మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 ఉంటే ప్రభుత్వం దాన్ని రూ.11.60 పైసలకు కొనుగోలు చేసిందని చెప్పారు. సంచుల కొనుగోలులో రూ.8 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందన్నారు. చౌక డిపోల నుంచి సరుకులు తెచ్చుకోవడానికి ప్రజలు సొంత సంచులను తీసుకెళుతుంటారని, అలాంటప్పుడు ప్రభుత్వం గిఫ్ట్ సంచులను ఎందుకివ్వాలని ప్రశ్నించారు. ఓ మంత్రి అనుచరుడికి దోచి పెట్టడానికే ఈ సంచులను కొనుగోలు చేశారన్నారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ సంచుల కొనుగోలుకు ఎందుకు తగలేశారని ప్రశ్నించారు.

కందిపప్పులో రూ.12 కోట్లు, నెయ్యి కొనుగోలులో రూ.26 కోట్లు, సంచుల్లో రూ.8 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇవిగాక బెల్లాన్ని కూడా మార్కెట్ ధరకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని చెప్పారు. చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థకు, తెలుగు తమ్ముళ్లకు, ఎన్నికల్లో తనకు నిధులు సమకూర్చినవారికి ఆర్థికలబ్ధి చేకూర్చేందుకే ఈ పథకం ఉపయోగపడిందని పేర్కొన్నారు. దీన్ని ప్రజలకిచ్చిన చంద్రన్న కానుక అనాలా లేక చంద్రబాబు హెరిటేజ్‌కు, తెలుగు తమ్ముళ్లకు ఇచ్చిన పండుగ కానుక అనాలా.. అని ఎద్దేవా చేశారు.

చంద్రన్న కానుక వ్యవహారం చూస్తే పోకిరి సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం బిచ్చగాడికి అర్ధరూపాయి వేసి పండుగ చేస్కో.. అన్నట్లుగా ఉందన్నారు. సంక్రాంతికి రైతుల ఇళ్లకు అల్లుళ్లు, కు మార్తెలు, బంధువులంతా వస్తారని, ఏ ఇంట్లో నూ పదిమందికి తక్కువుండరని.. వారు వంటలు వండుకోవడానికి ప్రభుత్వమిచ్చే కొద్దిపాటి సరుకులు ఏంసరిపోతాయని ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీకి వందెకరాల భూమి ఇవ్వడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ఉచిత సేవలందించడానికి సింగపూర్ కంపెనీలేమైనా మనకు బంధువులా అని తొలుత కూడా తాము ప్రశ్నించామని, ఈ వందెకరాలు ఇస్తుంటే అసలు విషయం బయటపడుతోందని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement