‘ఉరి’మిన కష్టాలు | suside to Sharecropper former | Sakshi
Sakshi News home page

‘ఉరి’మిన కష్టాలు

Aug 16 2015 11:41 PM | Updated on Nov 6 2018 7:56 PM

‘ఉరి’మిన కష్టాలు - Sakshi

‘ఉరి’మిన కష్టాలు

భూమిని నమ్ముకున్న కౌలురైతుని నష్టాలే కడతేర్చాయి. ప్రభుత్వ సాయం నామమాత్రం కావడం, అప్పులు తీరే ...

అచ్యుతాపురం: భూమిని నమ్ముకున్న కౌలురైతుని నష్టాలే కడతేర్చాయి. ప్రభుత్వ సాయం నామమాత్రం కావడం, అప్పులు తీరే మార్గంలేకపోవడంతో మండలంలోని తిమ్మరాజుపేటకు చెందిన శీరం అప్పారావు(58)అనే కౌలురైతు ఆదివారం తెల్లవారుజామున ఇంటిపైకప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్‌ఐ అప్పారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. అప్పారావు ఆరు  ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. పంటపోయినా క్రమం తప్పకుండా కౌలు చెల్లించేవాడు. వరుస తుఫాన్లతో పంట కలిసిరాలేదు. ఏటా పెట్టుబడులకు బెల్లం మార్కెట్ షావుకార్ల వద్ద అప్పులు చేశాడు. కుటుంబ అవసరాలు, కొడుకు చదువు, కుమార్తె పెళ్లికి అధికవడ్డీకి బయట మరికొందరి వద్ద అప్పులు చేశాడు. ఉన్న నగలు బ్యాంకులో తాకట్టుపెట్టాడు. పాస్‌పుస్తకం ఆధారంగా ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం, రుణమాఫీ  భూమి యజమానికే దక్కింది.

పాస్‌పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులో అప్పు పుట్టలేదు. బంగారు నగలపై తీసుకున్న రుణానికి మాఫీ వర్తించలేదు. ఇలా అన్ని విధాలా నష్టపోయిన అప్పారావు మదుపులు లేక కౌలు సాగు మానేశాడు. పరవాడ పార్మాసిటీలోని ఒక పరిశ్రమలో పనికి కుదిరాడు. అక్కడి రసాయనాల తాకిడికి నెల రోజులకే చర్మవ్యాధికి గురయ్యాడు. దానిని నయం చేసుకోవడానికి రూ.లక్షపైనే ఖర్చయింది. పరిశ్రమ యాజమాన్యం కేవలం రూ.25వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. చేబదులుగా తీసుకున్నవి, బయట ఫైనాన్స్ దారులనుంచి పొందినవి మొత్తంగా రూ.3.5లక్షలు వరకూ అప్పులు ఉన్నట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. వాటిని తీర్చలేకపోగా తాను కుటుంబానికి భారమయ్యానంటూ తరచూ వాపోయేవాడు. తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. ఎస్‌ఐ అప్పారావు కేసు నమోదు చేశారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

 అందరితో ఫోన్‌లో మాట్లాడాడు.....
 శనివారం రాత్రి భోజనం చేశాక విశాఖలో ఉన్న కొడుకు రమేష్, రాంబిల్లి మండలం అప్పన్నపాలెంలోని అత్తవారింట ఉన్న కుమార్తె సంజీవిలకు ఫోన్‌చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. భార్య ఆదిలక్ష్మి గదిలో పడుకుంది. అప్పారావు మేడపైన నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున భార్య మేడపైకి వెళ్లి చూసేసరికి పక్కపై అప్పారావు లేడు. పరిశీలించగా ఇంటిస్లాబ్‌కు పొరుగింటి స్లాబ్‌కు మధ్య ఖాళీలో చీర వేలాడుతూ ఉంది. దానికి ఉరివేసుకుని కనిపించాడు. దానిని చూసి ఆమె పెద్ద పెట్టున రోదించడంతో పరిసరాల్లోని వారు వచ్చి కిందికి దించి పరిశీలించగా అప్పటికే ప్రాణాలు వదిలాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement