పంచాయతీ పిడుగు?

పంచాయతీ పిడుగు? - Sakshi


* జెడ్పీ, ఎంపీ చైర్‌పర్సన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల రిజర్వేషన్లు నేడు ఖరారు!

* పంచాయతీరాజ్ ఎన్నికలపై నేడు సుప్రీంలో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

* 2011 జూలై నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలు

* సుప్రీం ‘మున్సిపోల్స్ తీర్పు’ దృష్ట్యా ఈ ఎన్నికల నిర్వహణకు కసరత్తు షురూ

* ఒకవైపు మున్సిపోల్స్, మరోవైపు సార్వత్రిక సమరంతో ఇప్పటికే పార్టీల్లో గందరగోళం

* మున్సిపల్ ఫలితాల ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందనే భయం

* తాజాగా ‘పంచాయతీరాజ్’ కదలికలపై నేతల్లో మరింత అయోమయం

* ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారుల మల్లగుల్లాలు

 

సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు.. మరోవైపు సార్వత్రిక సమరం! తాజాగా పంచాయతీరాజ్ పోరు సూచనలు!! అంతా అయోమయం.. గందరగోళం. సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిపడిన మున్సిపల్ ఎన్నికలే రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వేర్వేరు వ్యూహాలు అవసరమైన ఈ రెండు ఎన్నికలను ఎదుర్కోవడమెలా అని పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి. మున్సిపల్ ఫలితాలు ఎగ్జిట్ పోల్‌లా మారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఇబ్బందులు సృష్టించే ప్రమాదముందంటూ ఎన్నికల కమిషన్‌కు మొరపెట్టుకుంటున్నాయి.



ఈ పరిస్థితుల్లో మొదలైన పంచాయతీరాజ్ ఎన్నికల కసరత్తు నేతల్లో మరింత అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. మూడేళ్లుగా వాయిదాలు పడుతున్న పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో పడింది. శుక్రవారం జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల చైర్‌పర్సన్లతోపాటు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి, ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించడానికి రంగం సిద్ధమైంది.



సుప్రీం విచారణ నేపథ్యంలోనే..

* 2011 జూలై నుంచి వివిధ కారణాలతో వాయిదా పడుతున్న ఈ ఎన్నికలు అకస్మాత్తుగా తెరపైకి రావటానికి.. ఈ ఎన్నికల అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుండటమే కారణం.

 

* 2011లో జిల్లా పరిషత్, మండల పరిషత్ రిజర్వేషన్లను ఖరారు చేసినప్పుడు మొత్తం రిజర్వేషన్లు 60.5 శాతంగా ఉండడంతో... అది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ ఎన్నికలు ఆగిపోయాయి.

 

* గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ముందుగా ఎన్నికలైతే నిర్వహించండి అంటూ సుప్రీం ఆదేశించడంతో 60.5% రిజర్వేషన్లతో గత జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేదు.

 

* రాష్ట్రంలో 22 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, 1,100 జెడ్పీటీసీలు, 1,100 మండల పరిషత్ చైర్‌పర్సన్లు, 16 వేలకు పైగా ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదే అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

 

* మున్సిపల్ ఎన్నికల్ని సకాలంలో నిర్వహించక తప్పదని ఇటీవల హైకోర్టు తీర్పు  ఇవ్వడం దాన్ని సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు తరుముకొచ్చారుు.

     

* ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీం తీర్పు ఇస్తుందేమోనని రాష్ట్ర అధికార యంత్రాంగం భావిస్తోంది. అందుకనే ఇప్పటికిప్పుడు రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో పడింది.

     

సర్వత్రా ఉత్కంఠ

శుక్రవారం సుప్రీంకోర్టు పంచాయతీరాజ్ ఎన్నికలపై ఏం చెబుతుందోననే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికలు సైతం పార్టీ గుర్తులపైనే జరగనున్నారుు. ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశిస్తే మాత్రం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పూర్తి గందరగోళంగా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం మార్చి 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, ఏప్రిల్ రెండోతేదీన ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ ఫలితాలు ప్రకటించిన రోజే సాధారణ ఎన్నికల తొలి విడతకు నోటిఫికేషన్ జారీ కానుంది.



అధికార యంత్రాంగమంతా ఆ ఎన్నికల హడావుడిలో మునిగిపోతుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ ఏడో తేదీ వరకూ కొనసాగనుంది. ఆ రోజు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చైర్‌పర్సన్లను, మేయర్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ మున్సిపల్ ఎన్నికలతో పాటే పంచాయతీరాజ్ ఎన్నికలూ నిర్వహించాల్సి వస్తే... ఇంత త్వరగా కసరత్తు, ఏర్పాట్లు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



ఒకవేళ సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహించాలనుకుంటే... మే 16 వరకూ ఈ ఎన్నికలు సాగుతాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన కసరత్తు చివరి దశలో ఉంటుంది. జూన్ 2 లోపు రెండు ప్రభుత్వాలు ఏర్పడి శాసనసభలు కొలువుతీరాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో అధికార యంత్రాంగం పంచాయతీరాజ్ ఎన్నికల్ని నిర్వహించగలగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీం ఏం చెబుతుంది? ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది? అనే అంశాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top