అన్నం కూడా పెట్టకుండా విచారించారు

Sujana Chaudhary allegations on ED officers at Delhi High Court - Sakshi

ఈడీ అధికారులపై కోర్టులో సుజనా చౌదరి ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు విచారణ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తనకు ఆహారం కూడా ఇవ్వలేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు యలమంచిలి సుజనాచౌదరి బుధవారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. విరామ సమయంలో భోజనం ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారని ఆరోపించారు. ఉదయం పదకొండన్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తనను అధికారులు విచారించారని, ఇలా వరుసగా రెండు రోజుల పాటు సాగిందని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ అది నిజమే అయితే మానవహక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు.

అయితే సుజనాచౌదరి ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. ఆహారం అందజేయబోతే చౌదరి తిరస్కరించారని, అరటిపండు మాత్రం తిన్నారని కోర్టుకు వివరించారు. చౌదరి తరఫు న్యాయవాది స్పందిస్తూ తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, వీటిపై అఫిడవిట్‌ కూడా దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన కోర్టు చౌదరి దాఖలుచేసే అఫిడవిట్‌కు స్పందించాలని ఈడీ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top