తెలుగుజాతిని విడదీయవద్దంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యచరణలో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది.
కర్నూలు, న్యూస్‌లైన్: తెలుగుజాతిని విడదీయవద్దంటూ అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యచరణలో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును నిరశిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సమైక్యవాదుల నుంచి సంఘీభావం వెల్లువెత్తింది. 7వ తేదీ నుంచి 10 వరకు తాలుకా కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతాయి. ఆలూరు అంబేద్కర్ సర్కిల్ ఆవరణలో చేపట్టిన దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం, బీసీ సెల్ కన్వీనర్ డాక్టర్ మధుసూదన్ ప్రారంభించారు. పది మంది దీక్షల్లో పాల్గొన్నారు.
ఆదోని బీమా సర్కిల్‌లో దీక్షలను స్థానిక నాయకులు ప్రసాదరావు, చంద్రకాంత్‌రెడ్డి, విశ్వనాథగౌడ్ ప్రారంభించారు. మహిళా విభాగం కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు. ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో బీవీ.రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన దీక్షల్లో మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు. డోన్ పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద మండల మాజీ అధ్యక్షుడు శ్రీరాములు ప్రారంభించిన దీక్షల్లో ఐదుగురు నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. కోడుమూరు పాతబస్టాండ్‌లో నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టగా 11 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో మండల కన్వీనర్ బసిరెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో గోనెగండ్ల మండలానికి చెందిన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజే వందమందికిపైగా నాయకులు, కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు.