చర్చిద్దాం రండి! | srpc to discuss over ppa! | Sakshi
Sakshi News home page

చర్చిద్దాం రండి!

Jun 21 2014 1:43 AM | Updated on Sep 18 2018 8:37 PM

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) రద్దు వివాదంతో తలెత్తుతున్న విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) రంగంలోకి దిగింది.

రంగంలోకి దిగిన ఎస్‌ఆర్‌పీసీ
ఇరు రాష్ట్రాల ఎస్‌ఎల్‌డీసీ చీఫ్ ఇంజనీర్లకు లేఖ
24న బెంగళూరులో సమావేశం
 
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏలు) రద్దు వివాదంతో తలెత్తుతున్న విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) రంగంలోకి దిగింది. ఈ అంశంపై చర్చించేందుకు రావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కమిటీ సభ్య కార్యదర్శి ఎస్.ఆర్.భట్ కోరారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు బెంగళూరులోని ఎస్‌ఆర్‌పీసీ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుందని ఇరు రాష్ట్రాలకు చెందిన లోడ్ డిస్పాచ్ సెంటర్ల(ఎస్‌ఎల్‌డీసీ) చీఫ్ ఇంజనీర్లను ఆహ్వానిస్తూ ఆయన శుక్రవారం లేఖ రాశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ కోటాల అంశాన్ని పరిష్కరించాలని ఎస్‌ఆర్‌పీసీని దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) ఆదేశించింది. దీంతో ఎస్‌ఆర్‌పీసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
 
 ‘ఏపీజెన్‌కో ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ కోటా విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయాన్ని శుక్రవారం(20న) ఉదయం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్‌సీ) దృష్టికి తెచ్చాం. ఏపీజెన్‌కో తమ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి షెడ్యూల్ వివరాలను ఇవ్వడం లేదు.

 

కేవలం జీరో(సున్నా) అని పంపుతున్నారు. వివరాలు పంపాలని కోరినా వారి నుంచి స్పందన లేదు. కోటాకు మించి విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ వాడుతోంది. ఇందుకు పెనాల్టీలు  చెల్లించబోమని కూడా చెబుతోంది. ఇది గ్రిడ్ నిర్వహణకు చాలా సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ఎస్‌ఎల్‌డీసీ ఉన్నతాధికారులతో చర్చించాలనుకుంటున్నాం. మీరు సమావేశానికి రండి’ అని ఎస్‌ఆర్‌పీసీ తన లేఖలో పేర్కొంది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ)తో పాటు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డెరైక్టర్, ఏపీ ట్రాన్స్‌కో, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీలు, జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ) ఈడీలకు కూడా ఈ లేఖ కాపీలను పంపినట్లు తెలిపింది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement