హక్కు హక్కే.. భిక్షం భిక్షమే

హక్కు హక్కే.. భిక్షం భిక్షమే - Sakshi

  • 'హోదా'ను వదులుకుంటే ఏపీకి తీరని నష్టం

  •   ప్యాకేజీలను స్వీకరిస్తే పెద్ద తప్పవుతుంది

  •   అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడి

  •  సాక్షి, హైదరాబాద్: విభజనలో అన్నింటా అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రత్యేక హోదా తప్పనిసరి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. ప్యాకేజీలకు అంగీకరించి 'హోదా' ను వదులుకుంటే తీరని నష్టం జరుగుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. శాసనసభలో మంగళవారం ప్రత్యేక హోదా తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీల్లో ఏది మేలనే అంశాన్ని ఉదాహరణలతో వివరించారు.


    ''ప్రత్యేక హోదా అనేది హక్కు.. ప్యాకేజీ అనేది భిక్షం.. ఎప్పుడైనా హక్కు హక్కే.. భిక్షం భిక్షమే. మన ప్రమేయం లేకుండా అన్యాయంగా విభజించడం వల్ల రాష్ట్ర అభివృద్ధి బాధ్యత కేంద్రంపై ఉంది. చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రం అమలు చేయాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తూ మేం చేసుకుంటామని రాష్ట్రం అంటే చివరకు నష్టపోవాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం బాధ్యతలను కేంద్రానికి ఇవ్వకుండా మేమే చేపడతామని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నట్లుగా కేంద్రం భావించే ప్రమాదం ఉంది. ఒక ఇంట్లో ఇద్దరు కవల పిల్లలుంటే.. ఏడ్చే పిల్లాడికే ఎక్కువ పాలు దక్కుతాయి. ఇక్కడ కూడా అంతే. రాష్ట్రం సొంతంగా చేసుకునే స్థాయిలో ఉందనుకుంటే కేంద్రం అందించే సాయంలో వాటా తగ్గిస్తుంది'' అని బుగ్గన వివరించారు. బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం ప్రకటిస్తే ఆ రాష్ట్ర సీఎం నితీష్ తిరస్కరించారని, హోదాయే కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులు అయోమయ ప్రకటనలు చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. ఇలాంటి ప్రకటనల వల్లే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. హోదాతో అనేక ప్రయోజనాలున్నాయని, పరిశ్రమలు భారీగా రావడానికి ఇది తోడ్పడుతుందని వివరించారు.

     ఆందోళన చెందాల్సిన పనిలేదు

     ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. రాష్ట్రానికి రావాల్సినవన్నీ తెచ్చేందుకు టీడీపీ, బీజేపీ ప్రయత్నిస్తాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top